మరికొద్ది రోజుల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ స్టేడియం వేదికగా న్యూజిల్యాండ్-టీమిండియా మధ్యా ఈ మ్యాచ్ జరగనుంది. జూన్ 18 నుంచి 22 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. గెలిచిన జట్టు టెస్టుల్లో ప్రపంచ విజేత కిరీటాన్ని దక్కించుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు నిన్న(బుధవారం) ఇంగ్లండ్ బయలుదేరారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ముంబైలో కుటుంబంతో కలిసి రెండు వారాలుగా క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇక ఇప్పడు ఇంగ్లండ్ వెళ్లిన తరువాత కూడా అక్కడ ఓ 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. మరి ఇన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంటే వీళ్ల ప్రాక్టీస్ ఎలా సాగుతుంది..? ఇంగ్లండ్ వంటి బౌన్సీ పిచ్‌లపై వారికి అలవాటెలా అవుతుంది..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే సదరు క్రికెట్ అభిమానులను తొలిచేస్తున్నాయి. మరో పక్క కివీస్ జట్టు దాదాపు నెల రోజుల క్రితమే ఇంగ్లండ్ చేరి చాలా రోజులుగా అక్కడ ప్రాక్టీస్ చేస్తోంది.
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం టీమిండియి బుధవారం ఇంగ్లండ్ బయలుదేరింది. మూడున్నర నెలల పాటు సాగే ఈ టూర్ కోసం భారత క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో బయలుదేరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అటుంచితే.. 2018 తర్వాత ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టులు ఆడడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు బుధవారం జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. టీం ప్రాక్టీస్ తమకు ఏ మాత్రం సమస్య కాదని చెబుతున్నాడు. గతంలో ఇంతకంటే ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాలు సాధించామని గుర్తు చేశాడు. ‘ఈ పర్యటన కోసం మేం సరిగా సన్నద్ధం కాలేదనే అంశం గురించి ఎలాంటి ఆందోళన లేదు. సిరీస్ ప్రారంభానికి కేవలం 3 రోజుల ముందు ప్రత్యర్థి దేశంలో అడుగు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలా వెళ్లి కూడా సిరీస్‌లో హోరాహోరీగా తలపడ్డాం. ఇంగ్లండ్‌లో పరిస్థితుల గురించి బాగా తెలుసు. సరైన మానసిక దృక్పథంతో మైదానంలోకి అడుగు పెడితే విజయం దక్కించుకోవచ్చు. ఇక మాకన్నా ముందు న్యూజిలాండ్ అక్కడ టెస్టులు ఆడుతోంది కాబట్టి వారికి అనుకూలత ఉందంటే నేను నమ్మను. అలా గనక భావిస్తే మేం ఇక్కడి నుంచి విమానం ఎక్కడమే అనవసరం. నా దృష్టిలో ఇద్దరికీ సమానావకాశాలు ఉన్నాయి.’ అని కోహ్లీ చెప్పాడు.
ఇక టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో అయినా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను ‘బెస్టాఫ్ త్రీ’ విధానంలో మూడు టెస్టుల సిరీస్‌గా నిర్వహిస్తే బాగుంటుందని సూచించాడు. ఒక జట్టు రెండున్నరేళ్ల శ్రమ ఫలితం తర్వాత అలా చేయడమే సరైన విధానమని చెప్పాడు. ఒకవేళ ఓడినా మేం ఇప్పటివరకు సాధించినదాని విలువ తగ్గిపోదు. మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఇక్కడికి వచ్చారు. రాత్రికి రాత్రే ఈ టీమ్ గొప్పగా మారిపోలేదు. మొదటిసారి జరుగుతోంది కాబట్టి ఈ ఫైనల్‌కు ఎంతో ప్రత్యేకం. అయితే క్వారంటైన్ నిబంధనలు ఆటగాళ్ల పరిస్థితిని కఠినంగా మారుస్తున్నాయనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు.