రాజకీయాలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సందేశాన్ని ఆవిష్కరిస్తూ, దానికి చక్కటి ఫ్యామిలీ డ్రామా, ప్రేమ, వినోదం వాటి అంశాలను మేళవించి రూపొందించిన “భరత్ అనే నేను” చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో వేరుగా చెప్పనక్కరలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కధానాయకుడిగా తన పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయగా, అందాల భామ కైరా అడ్వాణీ జోడీగా నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2018 ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా ఏడేళ్ల కిందట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ఉదయం గం.11-11 నిమి. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు. కాగా ఈ రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం అద్భుతమైన ప్రేక్షకుల, అభిమానుల ఆదరణను చూరగొంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటోంది, ఎలాంటి రాజకీయ నాయకుల వల్ల వ్యవస్థ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోంది అన్న అంశాలను అన్ని తరగతుల ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చూపించారు. సినిమా ఆద్యంతం అందులో లీనమయ్యేలా చేస్తుంది. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, దేవరాజ్ నటన అదనపు ఆకర్షణ. రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం, దేవిశ్రీ ప్రసాడ్ సంగీతం అలరింపజేస్తాయి.