విండీస్ క్రికెటర్లు మైదానంలో క్రికెట్ ఆడుతూనే కుప్పకూలిపోయారు. వారికేమైందో తెలియక ఫిజియోలు, ఇతర జట్టు సభ్యులు మైదానంలోకి పరుగులు పెట్టారు. మ్యాచ్ కూడా నిలిచిపోయింది. ఈ ఘటన శుక్రవారం జరిగిన పాకిస్తాన్ వుమెన్స్-విండీస్ టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా.. ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు చినెల్లె హెన్రీ, చెడియన్ నేషన్‌లు గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ, నేషన్‌లు ఇలా పడిపోయారు. అయితే మిగతా ప్లేయర్లు వెంటనే అలెర్ట్ అయి సిబ్బందికి సంకేతాలిచ్చారు.
వెంటనే మైదనాంలోకి వచ్చిన ఫిజియో.. వారిని పరీక్షించి స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్లూ కోలుకుంటున్నారని.. వాతావరణ మార్పులు, విపరీతమైన వేడిని తట్టుకోలేక డీహైడ్రేట్ అయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా దీనిపై స్పందించింది. తమ ప్లేయర్లు పడిపోవడం ఆందోళన కలిగించిందని, అయితే వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నాదని తెలియడం ఆనందంగా ఉందని చెప్పారు.
కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వుమెన్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కైసియా నైట్ 30 నాటౌట్, చెడియన్ నేషన్ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ వుమెన్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. అప్పటికి పాకిస్తాన్.. 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విండీస్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.