సచిన్ టెండూల్కర్ కొడుకెవరు..? అని ఏ క్రికెట్ అభిమానిని అడిగినా.. అర్జున్ టెండూల్కర్ అని ఠక్కున సమాధానం చెప్తారు. కానీ సచిన్ కొడుకు ఎంఎస్ ధోని అంటే.. వింతగా ఉంటుంది కదూ..! అంతేకాదు.. ఇదే పేర్లతో టీచర్ జాబ్‌కు దరఖాస్తు చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక ఆకతాయి చేసిన పనితో చత్తీస్‌ఘడ్ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉంటుందో బట్టబయలైంది. అసలే ఉద్యోగాల నోటిఫికేషన్‌లు లేక అల్లాడిపోతున్న నిరుద్యోగులు.. అధికారుల దిక్కుమాలిన పనితీరు వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా డైరెక్ట్ ఇంటర్య్వూకు 15 మంది అభ్యర్థుల షార్ట్ లిస్ట్ అయ్యారు. ఆ షార్ట్ లిస్ట్‌లో తొలిపేరు మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ టెండూల్కర్, ఫ్రం రాజ్‌పూర్ జిల్లా అని ఉంది. అప్లికేషన్ ప్రకారం ఎంఎస్ ధోని దుర్గ్‌లోని సీఎస్‌వీటీయూ యునివర్సిటీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇలాంటి పేర్లతో అప్లికేషన్‌లు వచ్చినప్పడు కనీసం అక్కడి అధికారులు ఒక్కసారి కూడా ఎంక్వైరీ చేయకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే శుక్రవారం ఆ 15మందిని అధికారులు ఇంటర్య్వూకు పిలిచారు. అయితే ధోని పేరుతో ఉన్న అభ్యర్థి ఇంటర్య్వూకు రాలేదు. దీంతో అప్లికేషన్‌లో ఉన్న మొబైల్ నెంబర్‌కు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అప్పుడు కానీ అధికారులకు బల్బు వెలగలేదు. దీంతో తనిఖీ చేస్తే ఆ అప్లికేషన్ ఫేక్ అని తేలింది. అధికారులు ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినా.. ఈ వ్యవహారం ఇంటర్య్వూకు వచ్చిన మిగతా అభ్యర్థులకు తెలిసిపోయింది. దీంతో వారు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో అధికారులు కూడా ఈ నకిలీ అప్లికేషన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే ఈ అప్లికేషన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు, ఫోటోతో బిహార్‌లో టీచర్ జాబ్‌కు ఎంపికైన విషయం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం మరిచిపోకముందే ధోనీ విషయం బయటపడడం ఉద్యోగార్థుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది.