భారత మాజీ కెప్టెన్, టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి పెద్ద రిలీఫ్ లభించింది. దీంతో ధోనీ చాలా సంతోషంలో ఉన్నాడు. ఇటీవల కరోనా బారిన పడిన ధోనీ తల్లిదండ్రులు ఆ మహమ్మారి బారి నుంచి సురక్షితంగా కోలుకోవడమే దీనికి కారణం. ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌సింగ్‌లకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో వారిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ సమయంలో ధోనీ ముంబైలో ఉన్నాడు. అయితే ఐపీఎల్ బయోబబుల్‌లో ఉడడంతో వారిని కలిసేందుకు కూడా ధోనీ వెళ్లలేకపోయాడు. దీంతో ధోనీ చాలా ఆవేదనకు గురయ్యాడు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వారిద్దరూ కరోనాను విజయవంతంగా జయించారని తెలియడంతో ధోనీ ఆనందానికి అవధుల్లేకుండా ఉంది.
ఈ నెల 20న ధోనీ తల్లిదండ్రులకు కరోనా నిర్ధారణ కాగా.. రాంచీలోని పూలే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. వారి ఆక్సిజన్ లెవల్స్ స్థిరంగా ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని ఏప్రిల్ 21న ఆసుపత్రిలోని వైద్యులు వెల్లడించారు. అయితే వారిద్దరూ కోలుకునే వరకు అవసరమైన వైద్య సేవలన్నీ అందిస్తామని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా వారిద్దరూ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్ధిరంగా ఉండడంతో వైద్యులు మళ్లీ వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో ఇరువురికీ కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ధోని తల్లిదండ్రలకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు, ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు తెలిపారు. దీంతో బుధవారం రాత్రి వాళ్లను డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని ధోని స్వయంగా తనతో చెప్పినట్లు సీఎస్‌కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు. అలాగే ధోనీ తల్లింద్రండులు కోలుకోవడంతో అతడి ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అవుతున్నారు.