ప్రస్తుతం ఐపీఎల్‌లో దాదాపు 10మందికి పైగా న్యూజిల్యాండ్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో అనేకమంది ఆ దేశ జాతీయ జట్టులో సభ్యులు. అయితే ఈ టోర్నీ ముగిసిన తరువాత మాత్రం వారు తమ స్వదేశానికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దానికి కారణం.. వెంటనే ఇంగ్లండ్ పర్యటన ఉండడమే. భారత్‌లో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో పలు ఆంక్షల మధ్య స్వదేశానికి వెళ్లి అక్కడి నుంచి మళ్లీ ఇంగ్లండ్ వెళ్లడం చాలా కాష్టంతో కూడుకున్న విషయమని వారు భావిస్తున్నారు. దాంతో వారంతా భారత జట్టుతో పాటు ఇక్కడి నుంచే ఇంగ్లండ్ వెళ్లాలని భావిస్తున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత తదుపరి నెలలో ఇంగ్లండ్‌లో సౌతాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు జరిగనుంది. ఇందులో టీమిండియా – న్యూజిలాండ్ ఆడాల్సి ఉంది.
ఈ పర్యటనకు వెళ్లాల్సిన కివీస్ టెస్టు జట్టులో కెప్టెన్ విలియమ్సన్, బౌల్ట్, జేమీసన్, శాంట్నర్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇప్పుడు స్వదేశానికి వెళితే అక్కడ కరోనా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అలాగే చాలా సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటిలో నెగెటివ్ వచ్చిన తర్వాతనే వారు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత కూడా ఇదే ప్రొసీజర్ మళ్లీ ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ కోసం బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లంతా నేరుగా ఇంగ్లండ్ బయలు దేరితే అక్కడ ఇంగ్లండ్‌లో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవరసరం ఉండదు. ఈ కారణంగానే వారంతా నేరుగా ఇంగ్లండ్ వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
దీని గురించి న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హీత్ మిల్స్ మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్‌కు వచ్చి రెండు వారాలు క్వారంటైన్ తర్వాత ఇంగ్లండ్ బయల్దేరడం అంత సులువు కాదు. అందుకే మా వాళ్లంతా భారత్‌లోనే ఉండిపోవడం మంచిది. టెస్టు జట్టులో లేని వారు స్వదేశం వచ్చేందుకు కూడా మేం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. విమాన రాకపోకల సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఈ అంశంలో బీసీసీఐతో చర్చిస్తున్నాం’ అని పేర్కొన్నారు.