కరోనా ఉధృతి నేపథ్యంలో దేశ వ్యప్తంగా పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూలు అమలులో ఉండడం వల్ల ఇప్పట్లో పరీక్షలు జరిగే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దీంతో గతేడాదిలానే ఈ ఏడాది విద్యా సంవత్సరం కూడా వృథా అవుతుందేమోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలు పెట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఓపెన్‌బుక్, ఇంటి వద్ద నుంచే పరీక్ష రాయడం వంటి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాయి.
ఇటీవల ఛత్తీస్‌ఘర్ ప్రభుత్వం 12వ తరగతి పరీక్షలను ఓపెన్ బుక్ పద్ధతిలో ఇంటి నుంచే రాసుకునేందుకు విద్యార్థులకు వీలు కల్పించింది. దీంతో ఈ విధానంపై డిమాండ్ మరింత పెరుగింది. ఇదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని విద్యార్థి సంఘాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. దీనికి సంబంధించిన కేంద్ర విద్యాశాఖామంత్రికి అనేక విద్యార్థి సంఘాలు లేఖలు కూడా పంపించాయి. ఇంటి వద్దనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లను విద్యార్థుల ఇళ్లకు పంపి.. నిర్ణీత సమయంలోగా పరీక్ష పూర్తి చేయించి.. అనంతరం వాటిని ఆన్‌లైన్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ తిరిగి తీసుకొనే విధానాన్ని పరిశీలించాలని తమ లేఖల్లో కోరాయి.
అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా ఇదే విషయంపై కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు లేఖ అందజేసింది. విద్యార్థులకు ఓపెన్ బుక్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని కోరింది. ఇదిలా ఉంటే సీబీఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు, వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాలన్నీ మే 25 నాటికి తమ అభిప్రాయాలు తెలియజేయాలని సూచించింది. నేటితో ఆ గడువు ముగియనుంది. ఇక దీనిపై కేంద్రం వచ్చే నెల 1న నిర్ణయం తీసుకోనుంది. అలాగే అన్ని సబ్జెక్టులకు కాకూడా ప్రధానమైన సబ్జెక్టుల పరీక్షలు మాత్రమే నిర్ణయించే ఆలోచన కూడా కేంద్రం చేస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం త్వరలో తెలిసే అవకాశం ఉంది.