దేశంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్‌పై పోరుకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగా రాష్ట్రాలకు యాంఫోటెరిసిన్-బీ వయల్స్‌ను వేల సంఖ్యలో పంపేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఒక్కో రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి 19,420 యాంఫోటెరిసిన్ వయల్స్‌ను అదనంగా కేటాయించినట్టు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. దీనిపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ మాట్లాడుతూ.. మే 21న ప్రకటించిన వాటితో కలిపి ఇప్పటివరకు 23,680 వయల్స్‌ను కేటాయించామన్నారు.
అంతేకాకుండా బ్లాక్ ఫంగస్‌కు సంబందించిన అనేక కీలక ఆదేశాలు కూడా కేంద్రం జారీ చేసింది. ముఖ్యంగా 1897 అంటువ్యాధుల చట్టం కింద నోటిఫియబుల్ డిసీజ్‌గా గుర్తించాలని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా బ్లాక్ ఫంగస్ కేసులను ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెయలెన్స్ ప్రోగ్రాం (ఐడీఎస్‌పీ)కి రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించింది.
కేంద్రం ఆదేశాలతో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్‌ను నోటిఫియబుల్ డిసీజ్‌గా ప్రకటించాయి. సోమవారం వరకూ ఢిల్లీలో 500కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల వరకు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఆయా రాష్ట్రాలలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.