రష్యాకు చెందిన కరోనా టీకా స్పుత్నిక్-వీ తయారీ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న పనేసియా బయోటెక్ సంస్థ కలిసి సంయుక్తంగా పనిచేసేందుకు సిద్ధమవుతోంది. అయితే దీనికి కేంద్రం అనుమతించాలనుకుంటే.. మాత్రం సదరు తయారీ సంస్థ రూ.14 కోట్ల రూపాయలతోపాటు 2012 నుంచి ఇప్పటివరకు వడ్డీని కూడా చెల్లించాలని ఆదేశించింది.
ఈ క్రమంలోనే దేశంలోని వ్యాక్సిన్ కొరతపై జస్టిస్ మన్మోహన్, జస్టిస్ నజ్మి వజీర్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు బట్టింది. ఎక్కడో రష్యాలో ఉన్న వారికి భారత దేశంలోని హిమాచల్‌లో వ్యాక్సిన్ తయారీకి కావలసిన మౌలిక వసతులు కనిపించాయని, కానీ కేంద్రానికి మాత్రం అవి కనిపించలేదని వ్యాఖ్యానించింది.
‘పక్క దేశాలకు మనదేశంలోనే వ్యాక్సిన్ తయారీ సంస్థలు దొరుకుతున్నా.. కేంద్రానికి మాత్రం ఇన్నాళ్లూ వాటిని గుర్తించలేకపోయింది. ఇది చాలా దురదష్టకరం. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని కేంద్రం చెబుతున్నా.. దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉండడం నిజంగా బాధాకరం’ అని ఢిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా.. 2020లో సదరు బయోటెక్ సంస్థకు, కేంద్రానికి మధ్య జరిగిన ఓ కేసుపై కంపెనీ మళ్లీ కోర్టులో పిల్ దాఖలు చేయడంతో తాజా విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగానే ఢిల్లీ హైకోర్టుల పై వ్యాఖ్యలు చేసింది.