లక్నో: అయోధ్య రామాలయ నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విపక్షాల ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. ఆ ఆరోపణలన్నీ రాజకీయంగా ప్రేరేపించన ఆరోపణలని, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని మండిపడ్డారు. 2019 లో సుప్రీం కోర్టు అయోధ్యపై తీర్పు వెలువరించగానే దేశవ్యాపితంగా ఉన్న ప్రజలందరూ అయోధ్యకు వచ్చి, భూములు కొనడం ప్రారంభించారని, అందుకే ధరలు పెరిగాయని వివరించారు. తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన భూములన్నీ బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయబడ్డాయని తెలిపారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసం భూముల అమ్మకం, కొనుగోళ్ల ప్రక్రియ రెండు వర్గాల సంప్రదింపుల తర్వాతే జరిగిందని, ఆ తర్వాతే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశామని అన్నారు. అన్ని రకాల కోర్టు ఫీజులు, స్టాంపు పత్రాలను తాము ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. ఒప్పంద పత్రంపై సంతకాలు చేసిన తర్వాతే సంబంధిత భూమిని కొనుగోలు చేశామని, మొత్తం డబ్బును కూడా ఆన్‌లైన్ ద్వారా సంబంధిత వ్యక్తికి ఇచ్చామని చంపత్ రాయ్ తెలిపారు.
కాగా.. అంతకుముందు అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రతినిధి సంజయ్ సింగ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ట్రస్ట్ బాగోతాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. యూపీలోని లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సంస్థ సభ్యుడు అనిల్ మిశ్రాలు రూ. 2 కోట్ల విలువైన భూమిని రూ.18 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ ఉదంతంపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, ప్రభుత్వం, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా సమాజ్‌వాదీ మంత్రి, అయోధ్య మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే కూడా అయోధ్యలో భూముల కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
తేజ్ నారాయణ్ పాండే చేసిన ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ తీర్థ్ సోమవారంనాడు స్పందించారు. ట్రస్టుపై వచ్చిన ఆరోపణలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని హక్కులను ట్రస్టుకు ఇవ్వడం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా రామభక్తులంతా ట్రస్టుకు విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు. రామాలయ నిర్మాణానికి శివసేన కూడా విరాళం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.