Friday, November 1, 2024

ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపంగా మారింది: విజయశాంతి

రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల తీవ్ర అవస్థలు పడడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆలస్యంగా ధాన్యాన్ని కొనడమే కారణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రైతులు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారని, దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లతో రాష్ట్ర సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

సదరు ట్వీట్లలో.. ‘తెలంగాణ పాలకులు ఈ రాష్ట్రాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారో… ఎటు తీసుకుపోతున్నారో… ఊహిస్తుంటే భయమేస్తోంది. ధాన్యం కొనుగోలు తీరుపై రైతాంగం దాదాపు నెల రోజులుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదు. ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం చేసిన తీవ్ర జాప్యంతో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారి వారిని నడి రోడ్డుకీడ్చాయి. తడిసిన, రంగు మారిన, మొలకలెత్తిన ధాన్యంతో రైతులు పడుతున్న వేదన చూస్తుంటే కడుపు రగిలిపోతోంది. రాష్ట్ర సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ అకాల వర్షాల ధాటికి తెలంగాణ రైతులు ఇంతగా నష్టపోయి ఉండేవారు కాదన్నది పరమ సత్యం. వ్యవసాయదారులను నిలువునా ముంచెత్తిన వానలకు అధికారుల నిర్లక్ష్యం కూడా తోడైన ఫలితాన్ని… ఇప్పుడు తాము కూడా అనుభవించాలేమోనని ప్రజలు కూడా ఆందోళన పడుతున్నారు.

కిందటేడాది కురిసిన వానలు సృష్టించిన బీభత్సం నుంచి నేటికీ హైదరాబాద్, వరంగల్ పౌరులు తేరుకోలేదు. నాటి వర్షాల దెబ్బకు నీట మునిగిన ఈ నగరాల్లోని పలు ప్రాంతాలు నెలల తరబడి సాధారణ జీవనానికి దూరమయ్యాయి. నిజం చెప్పాలంటే నేటికీ ఆ ప్రాంతవాసులు పూర్తిగా తేరుకోలేదు. ఆ ప్రాంతాల్ని సర్కారు కూడా పూర్తిగా పునరుద్ధరించలేదు. ఇంతలోనే వానాకాలం చేరువ కావడంతో కాలువలై పారే రోడ్లు… చెరువుల్ని తలపించే కాలనీలు… ఏ మాత్రం పట్టింపులేని సర్కారు నిర్లిప్త వైఖరిని తల్చుకుని జనం కలవరపడుతున్నారు. కరోనా కష్టాల మధ్య రైతుల వెతలు ఒకవైపు… వానా కాలంలో స్తంభించే జన జీవనం మరొకవైపు… తమ లాభం మాత్రమే చూసుకునే సర్కారు పెద్దల తీరు ఇంకొకవైపు. హామీల మూటలు చూపిస్తూ పబ్బం గడుపుకునే ఈ సర్కారు ఈ వానల్లోనే కొట్టుకుపోవాలని జనం కోరుకుంటున్నారనడంలో సందేహం లేద’ని మండిపడ్డారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x