24వేల ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన ఓ జీవి మళ్లీ ఇన్నివేల ఏళ్ల తరువాత ప్రాణం పోసుకుంది. భూమిపై ఈ అరుదైన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది.ఆ జీవి పేరు.. డెల్లాయిడ్ రాటిఫర్. ఈ జీవిని సైబీరియాలోని ఆర్కిటిక్ పెర్మాఫ్రోస్ట్(గడ్డకట్టుకుపోయిన సరస్సు)లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే ఈ అతి చిన్న జలచరం చూడ్డానికి జలగలా ఉంటుంది. దాదాపు 24 వేల సంవత్సరాలు ఈ జీవి ఘనీభవించిన స్థితి(క్రిప్టోబయోసిస్)లో ఉంది. కానీ ఇన్నివేల సంవత్సరాల తర్వాత దాని చుట్టూ ఉన్న మంచు కరిగి ఇది ఊపిరి తీసుకుంది. అంతేకాకుండా ప్రత్యుత్పత్తి కూడా ప్రారంభించడం ఇప్పుడు శాస్త్రవేత్తలకు కొత్త ఆలోచనలకు ఆజ్యం పోసింది.
ఈ అరుదైన జాతిలో ఉన్న మరో ప్రత్యేక విషయం ఏంటంటే.. వీటిలో మగవి ఉండవు. ఆడ జీవులు మాత్రమే ఉంటాయి. ఆడజీవుల్లో ప్రత్యుత్పత్తికి అవసరమైన అండాలు విడుదల కావడమే కాకుండా.. మగజీవి సహాయం లేకుండానే వాటి నుంచి పిల్లలు పుడతాయి. ఇవి గడ్డకట్టుకుపోయిన స్థితిలో వేల సంవత్సరాలు బతకగలవని తాజా అధ్యయనంలో తేలింది. తాజాగా బయటపడిన ఈ జీవి వయసు 24,485 సంవత్సరాలు ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాటిఫర్ అనే పేరు లాటిన్ నుంచి వచ్చింది. రాటిఫర్ అంటే `చక్రాలు గలది` అని అర్థం. డెల్లాయిడ్ రాటిఫర్ మంచి నీటి చెరువుల్లో, సరస్సుల్లో మాత్రమే జీవిస్తుంది. ఇవి ఎలాంటి విపరీత వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని మనుగడ సాగించగలవు. అలాగే సంవత్సరాల తరబడి ఆకలి, డీహైడ్రేషన్‌ను కూడా తట్టుకోగలవు. ఇది అతి చిన్న జీవి అయినప్పటికీ దీనిలో అనేక కణాలు ఉంటాయి. బహుళ కణ జీవిని గడ్డకట్టుకుపోయే స్థితిలో వేల సంవత్సరాలు ఉంచవచ్చని, వాటి చుట్టూ ఉన్న మంచును కరిగించి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చని ఈ జీవి ద్వారా శాస్త్రవేత్తలు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
కాగా.. మనిషిని కూడా ఇలా క్రయోజనిక్ స్లీప్‌లోకి పంపించాలని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ జీవి బయటపడడం శాస్త్రజ్ఞుల ఆలోచనలకు కొత్త ఊతం ఇచ్చింది.