దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి రోజూ లక్షల మంది కరోనా బారిన పడుతన్నారు. వీరిలో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక అనేకమంది కోలుకుంటున్నా.. దీర్ఘకాలం అనేక రకాల రుగ్మలతలో బాధపడుతున్నారు. కరోనా బారిన పడిన అనేకమంది కోలుకున్నప్పటికీ అంతకుమందే ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా వైరస్ నుంచి బయటపడిన తరువాత కూడా నానా అవస్థలు పడుతున్నారు. అంతకుముందున్న సమస్యలు మరింత తీవ్ర స్థాయిలో వారిని బాధపెడుతున్నాయి. ప్రధానంగా గుండె సంబంధిత సమస్యలున్న వారి ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. కొందరిలో తీవ్రమైన ఒంటి నొప్పులు, నీరసం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు దీర్ఘకాలం కనిపిస్తున్నాయి. చెమటలు పట్టడం, ఆయాసం, సిస్సత్తువ, నిద్రలేమి వంటి సమస్యలతో వారి జీవితమే నరకంగా మారుతోంది. ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న అత్యధిక శాతం మంది ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలుతోంది. దీంతో వైద్యులు కరోనా నుంచి కోలుకున్న వారికి అనేక రకాల సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ఏ మాత్రం సమస్యలు కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రధానంగా గుండె సాధారణం కన్నా వేగంగా కొట్టుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఈ సమస్య రావడం జరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నడిచినా, మెట్లెక్కినా మరీ ఎక్కువగా ఆయాసం రావడం, ఏ మాత్రం శ్రమ పడినా ఎక్కువగా చెమటలు పట్టడం వంటి అనారోగ్యాలు ఏ మాత్రం కనిపించినా వెంటనే తగిన జాగ్రత్తులు తీసుకోవాలని, వెంటనే వైద్యులను సంప్రదించాని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడాలంటే.. ఆహారంపై ప్రధాన దృష్టి సారించాలని, యాంటి ఆక్సిడెంట్లు ఉన్నవ ఆహార పదార్థాలను తీసుకోవాలని, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్డు, మాంసకృత్తులు, చిరు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్(బాదం, పిస్తా, అంజీర్, వాల్‌నట్స్) వంటివి ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని హెచ్చరించారు.