టీమిండియా క్రికెట్లో ఎప్పటికప్పుడు కొత్త కాంట్రవర్సీలు పుట్టుకొస్తుంటాయి. అలాగే వాటిపై క్రికెట్ అభిమానుల కామెంట్లు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల జరిగిన ఆసీస్ సిరీస్‌కు ముందు కూడా టీమిండియా, అప్పటి సెలెక్టర్లకు సంబంధించి అలాంటి వివాదమే నెలకొంది. ఆసీస్ పర్యటరకు టీమిండియా వెళ్లే సమయంలో టీమిండియా సెలెక్షన్ కమిటీ సభ్యుడొకరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్కకు కాఫీ అందించాడు. ఈ ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఓ సెలెక్టర్ అయి ఉండి అనుష్కకు కాఫీ అందించడాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. అయితే ఆ సిరీస్‌లో టీమిండియా గెలిచింది. సూపర్ స్టార్లు లేకపోయినా.. ఎలాంటి అనుభవం లేని కుర్ర క్రికెటర్లతో సిరీస్‌లో చారిత్రక విజయం సాధించింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కకు ఓ సెలెక్షన్ కమిటీ సభ్యడు కాఫీ ఇస్తే.. పెద్ద రచ్చ చేశారని, కానీ అదే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టు ఆసీస్ జట్టును చిత్తు చేసి చారిత్రక విజయం సాధించి తిరిగొస్తే.. ఒక్కరు కూడా సెలెక్షన్ కమిటీని ప్రశంసించలేదని అప్పటి టీమిండియా సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎంఎస్‌కే.. ‘ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఏడుగురు సూపర్ స్టార్లు జట్టులో లేకుండానే చారిత్రక విజయం సాధించింది. కానీ ఆ గెలుపులో సెలెక్టర్లకు కనీస భాగస్వామ్యం కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ ఓ సెలెక్టర్ విరాట్ భార్య అనుష్కకు కాఫీ ఇస్తే మాత్రం దానిపై పెద్ద రచ్చ చేశారు’ అంటూ ఎమ్మెస్కే ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్లో అంపైరింగ్ తర్వాత జట్టు సెలెక్షన్ చేయడమే అత్యంత కఠినమైన విషయమని, కోట్ల మంది అభిమానుల ఆశలన్నీ జట్టు గెలుపుపైనే ఉంటాయని, దానికోసం జట్టు కూర్పు ఎంతో ముఖ్యమని ఎమ్మెస్కే అన్నారు.
కాగా..ఎమ్మెస్కే టీమిండియాకు 2016 నుంచి 2017 వరకు సెలెక్షన్ కమిటీ చీఫ్‌గా ఉన్నారు. ఆయన సెలెక్టర్‌గా ఉన్న సమయంలో టీమిండియా రెండు భారీ ఐసీసీ టోర్నీల్లో పాల్గొంది. అందులో ఒకటి 2019 వన్డే ప్రపంచకప్ కాగా.. రెండోది 2017 చాంపియన్స్ ట్రోఫీ. ఇందులో 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓటమి చవిచూసింది. ఓ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడడం అదే తొలిసారి.