టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరో సారి గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణం కాపాడేందుకు తమవంతుగా సాయం అందించారు. ఆ చిన్నారి వ్యాధికి చికిత్స చేయాలంటూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం అవసరం. దీంతో చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడయాలో దీనికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. తమ చిన్నారి వైద్యానికి కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, దానికి సాయం చేయాలని తమ ట్విటర్ ఖాతాలో పెట్టిన పోస్ట్ విరుష్క దంపతులను కదిలించింది. దీంతో చిన్నారి వైద్యానికి తమ వంతుగా కొంత సాయం అందించారు. అలాగే తమ ఫ్యాన్స్‌ను కూడా వారికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. కోహ్లీ-అనుష్కల పిలుపుతో వారికి ఎంతోమంది సాయం అందించారు. దీంతో వారికి అవసరమైన రూ.16 కోట్ల రూపాయలు సమకూరాయయి.
ఢిల్లీకి చెందిన ఆయాన్ష్ గుప్తా అనే ఓ చిన్నారి వెన్నెముక కండరాలకు సంబంధించిన అరుదైన జెనెటిక్ వ్యాధి(స్పైనల్ మస్క్యులర్ ఎట్రాఫి)తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి చికిత్సకు `జోల్గెన్స్‌మా` అనే మందు అవసరం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం ఇది. అంత ఖరీదైన మందును కొనే స్తోమత లేని చిన్నారి తల్లిదండ్రులు నిధుల కోసం ట్విటర్ వేదికగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ విషయం కోహ్లీ దంపతులకు తెలిసింది. దాంతో వెంటనే తమవంతుగా కొంత సొమ్మును అందజేశారు. అలాగే అభిమానుల ద్వారా కూడా విరాళాలు వచ్చేలా చూశారు. దీంతో చిన్నారి వైద్యానికి అవసరమైన రూ.16 కోట్లు సమకూరాయి. ఈ విషయాన్ని చిన్నారుల తల్లిదండ్రులు వెల్లడించారు.
అలాగే తమ చిన్నారికి కోహ్లీ దంపతులు స్వయంగా సహాయం చేయడంతో పాటు తమ అభిమానులను కూడా ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం తమకెంతో ఆనందంగా ఉందని ట్విటర్‌లోనే చెప్పుకొచ్చారు. సోమవారం నాటికి రూ.16 కోట్ల నిధులు సమకూరాయని, ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడంలో వారి సాయం మరువలేమని పేర్కొన్నారు. కోహ్లీ దంపతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నామని తెలియజేశారు. కోహ్లీ దంపతులను ఇన్ని రోజులూ అభిమానించామని, ఇక ఇప్పటి నుంచి ఆరాధిస్తామని పేర్కొన్నారు.