యాస్ తుఫాను దూసుకొస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఇప్పటికే అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, పశ్చిమ బెంగాల్ – ఒడిషా తీరాల్లో ఇది తీరం దాటుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లోని సారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య బాలాసోర్‌కు దక్షిణ దిశలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాను పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 200 కిలోమీటర్లు, బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 290, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటిన తర్వాత 12 గంటల పాటు అతి తీవ్ర తుపానుగానే కొనసాగుతుందని, దీనివల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అయితే 27వ తేదీ ఉదయానికి క్రమంగా బలహీనపడుతుందని వారు తెలిపారు. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
కాగా.. ఈ తుఫాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులో సెక్షన్ సిగ్నల్ నంబర్–1, 2, 3తో పాటు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తత సమాచారం అందించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కెరటాల ఉద్ధృతి పెరుగుతుందని తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం 10 మీటర్ల ముందుకు వచ్చింది. సముద్రంలో బలంగా గాలులు వీయడం వల్లే సముద్రం ముందుకు వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తీరానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామస్తులు అధికారుల హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు.