న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసు యావత్ క్రీడా లోకంలో కలకలం రేపింది. సాగర్‌ను తోటి క్రీడాకారులే దారుణంగా గాయపరచడంతో తీవ్ర గాయాలతో అతడు ఆసుపత్రిలో మరణించాడు. దీనికి తోడు ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా.. స్టార్ రెజ్లర్, ఒలింపిక్ ఛాంపియన్ సుశీల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడం మరింత సంచలనంగా మారింది. సాగర్ చంపిన నేరస్థుల్లో ప్రధాన హస్తం సుశీల్‌దే అనేలా ఢిల్లీ పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం సుశీల్‌ను పోలీసులు ఘటన జరిగిన ఛత్రశాల్ స్టేడియం తీసుకువెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ‘సీన్ రీకన్‌స్ట్రక్షన్’ చేశారు. ఈ క్రమంలోనే మే 4 రాత్రి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అలాగే వివాదానికి కారణమైన మోడల్ హౌస్‌లోని ఫ్లాట్‌కు, షాలిమార్ బాగ్‌లో సుశీల్ నివాసం ఉంటున్న చోటుకు కూడా అతడిని తీసుకెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు.
కాగా.. మంగళవారం కూడా పోలీసులు సుశీల్‌ను దాదాపు 4 గంటలపాటు ప్రశ్నించారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు సుశీల్ సరైన సమాధానాలు చెప్పలేదట. ప్రతి దానికి సమాధానాలను అటు ఇటు మారుస్తూ చెప్పాడట. ఒకసారి సాగర్, సోనూలను తాను అక్కడకు లాక్కు రాలేదని, తగవు తీర్చేందుకు మాత్రమే వెళ్లానని చెప్పగా. మరోసారి దీని గురించే చెబుతూ తాను సాగర్‌ను కాస్త బెదిరించి భయపెట్టాలని మాత్రమే భావించానని కూడా చెప్పాడట. ఈ క్రమంలోనే అతడిపై అనుమానాలు మరింత ఎక్కవయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
అంతేకాకుండా సహజంగానే ఆందోళన గా ఉన్న సుశీల్ పదే పదే మాట మార్చాడు. గొడవ జరిగాక కూడా తాను ఛత్రశాల్ స్టేడియం లోనే ఉన్నానని, మరుసటి రోజు సాగర్ చనిపోయాడని తెలిశాకే పారిపోయానని మాతో చెప్పాడు’ అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు వెల్లడించారు. అంతటి పహిల్వాన్ కూడా జైలు గోడల మధ్య కన్నీళ్లు కార్చినట్లు ఆయన చెప్పారు. ‘లాకప్‌లో పెట్టగానే సుశీల్ ఏడ్చేశాడు. రాత్రంతా మెలకువతోనే ఉండి పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్న అతను ఏమీ తినేందుకు ఇష్టపడలేదు’ అని కూడా సదరు పోలీసు అధికారి తెలిపారు.