ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పురుషుడు మరణించారు. కోవిడ్–19 టీకా తీసుకున్న తొలి పురుషఉడిగా చరిత్ర సృష్టించిన విలియం షేక్‌స్పియర్(81) సోమవారం మరణించారు. యూనివర్సిటీ హాస్పిటల్ కోవెంట్రీ, వార్‌విక్‌షైర్‌లో గత ఏడాది డిసెంబర్ 8న విలియం మొట్టమొదటిసారిగా ఫైజర్ టీకా డోస్ తీసుకున్న పురుషుడిగా షేక్‌స్పియర్ రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత అనేకమంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. మొదటి వ్యక్తిగా మాత్రం విలియం నిలిచాడు. అయితే తాజాగా ఆయన మరణించారు. కోవిడ్‌యేతర రుగ్మతలతో అదే ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్ ఈనెల 20న కన్నుమూశారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. విలియంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కాగా.. అదే ఆస్పత్రిలో అంతకుముందు మార్గరెట్ కీనన్(91) అనే మహిళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఈమె కూడా ఫైజర్ టీకానే తీసుకున్నారు. కాగా.. టీకా తీసుకున్న తొలి మహిళగా, తొలి వ్యక్తిగా ఆమె రికార్దు సృష్టించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో దాదాపు 60 శాతం మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో అక్కడ కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. మరణాలు రేటు కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం అమెరికాలోని ప్రజలంతా మాస్కులు కూడా పెట్టుకోకుండా రోడ్లపై నిర్భయంగా తిరుగుతున్నారు.
ఇదిలా ఉంటే ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌కు కూడా రావల్సి ఉంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పంపిణీకి సంబందించి అమెరికా – భారత్ మధ్య ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నందున అనేకదేశాల నుంచి భారత్ వ్యాక్సిన్‌లను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ఫైజర్‌తో పాటు మొడెర్నా కూడా భారత్‌లో తమ వ్యాక్సిన్‌లు విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. అయితే భారత్ పేర్కొన్న నిబంధనలకు ఫైజర్ యాజమాన్యం ఒప్పుకోలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ విషయంలో మరిన్ని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.