కంప్యూటర్ వైరస్ ను నిరోధించడానికి ఎంతో అవసరమైన యాంటీ వైరస్ సృష్టించి ప్రపంచానికి ఎంతో మేలు చేసిన జాన్ మెక్‌ఎఫీ (75) బార్సిలోనాలోని ఓ జైలు గదిలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇటీవల పన్ను ఎగవేత ఆరోపణలతో జాన్ మెక్ఎఫీ జైల్లో ఉన్నారు. ఆయనను అమెరికాకు అప్పగించేందుకు విచారణ జరిపిన స్పానిష్ కోర్టు తీర్పు ఇచ్చింది.
జాన్ మెక్ఎఫీ.. తన ఆదాయంపై పన్ను చెల్లించడంలో విఫలమైనట్లు గత ఏడాది అక్టోబరులో టెనెసీలో కేసు నమోదైంది. దీంతో అప్పుడే ఆయనను స్పెయిన్ లో అరెస్టు చేశారు. ఆయన ఆర్థిక నేరాలకు పార్పడినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయనను అమెరికాకు అప్పగించడంపై తీర్పు కోసం ఇన్నాళ్లూ కోర్టులో విచారణ జరిగింది. కానీ.. తాజాగా అమెరికాకు అప్పగించేందుకు స్పానిష్ కోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో జాన్ అనుమానాస్పదంగా అమరణించడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. స్పానిష్ మీడియా కథనాల ప్రకారం, జాన్ మెక్ఎఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
జాన్ మెక్ఎఫీ 1987లో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మెక్ఎఫీని స్థాపించారు. ఆయన ఆ కంపెనీ నుంచి 1994లో వైదొలగారు. ఈ సంస్థను ఇంటెల్ 2010లో కొనుగోలు చేసింది. అదే సమయంలో పక్కింట్లో నివసించే గ్రెగరీ ఫౌల్ మరణం కేసులో జాన్ కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన దేశం విడిచి పారిపోయారు. బెలిజ్(సెంట్రల్ అమెరికా ఈశాన్య తీరంలోని ఓ దేశం) ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతో తాను దేశం నుంచి వెళ్ళిపోయానని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.