రెండేళ్లు సాగిన టోర్నీ. ఆసాంతం టాప్ ప్లేస్ లో టీమిండియా. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. న్యూజిల్యాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. భారత్ ను 8 వికెట్ల తేడాతో కివీస్ మట్టి కురిపించింది. డబ్ల్యూటీసీ ప్రారంభం నుంచి రెండేళ్లపాటు అద్భుతంగా ఆడిన టీమిండియా.. చివరిగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో బోల్తాపడి ట్రోఫీని పోగొట్టుకుంది. అయితే ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ప్రత్యర్థి జట్టు గెలుపును కానీ, ఆ జట్టు విజయాన్ని కానీ ప్రశ్నించని కోహ్లీ.. ఐసీసీపై మాత్రం అసహనం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. విజయానికి విలియమ్సన్ సేన అర్హమైనదేనంటూ ప్రశంసించాడు. అయితే ఐసీసీ నిర్ణయాన్ని మాత్రం తప్పు పట్టాడు. అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేసేందుకు ఒక్క మ్యాచ్ సరిపోదని అభిప్రాయపడ్డాడు.కనీసం 3 మ్యాచ్‌లు నిర్వహించి బాగా ఆడిన వారిని విజేతగా ప్రకటించాలని అభిప్రాయపడ్డాడు. ఒక్క మ్యాచ్‌తోనే ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టంగా చెప్పాడు.
ఇదిలా ఉంటే.. 18వ తేదీ నుంచి ప్రారంభమైన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో కివీస్-టీమిండియా పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆసాంతం బౌలర్ల ఆధిపత్యం సాగింది. తొలి ఇన్నింగ్స్ లో మొదట టీమిండియాను కివీస్ బౌలర్లు వణికించగా.. ఆ తర్వాత భారత బౌలర్లు కూడా విజృంభించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 217 పరుగులు ఆలౌట్ అయింది. ఇక కివీస్ కూడా 249 పరుగులు అలౌట్ అయింది. దీంతో 32 పరుగుల ఆధిక్యం సొంతం చెలుకుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ మరింత దారుణంగా 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 6వ రోజు 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ విలియమ్సన్ ధాటిగా ఆడడంతో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా అవతరించింది.