ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఈ టోర్నీ ఫైనల్ అతి త్వరలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత్-కివీస్ జట్లు తలపడబోతున్నాయి. అయితే ఒక్కటే మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ డ్రా లేదా టై అయితే పరిస్థితి ఏంటని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే 5వ రోజు మ్యాచ్ టై లేదా డ్రా అయితే 6వ రోజు రిజర్వ్ డేగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ నిర్ణయంలో ఐసీసీ వెనక్కి తగ్గిందట. దాని బదులుగా ఇరు జట్లనూ జాయింట్ విన్నర్స్‌గా ప్రకటించాలని నిర్ణయం తీసుకుందట. మ్యాచ్ డ్రా లేదా టై అయిన పక్షంలో న్యూజిలాండ్, టీమిండియాలను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఐసీసీ వెబ్సైట్లో ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
ఆట పరిస్థితుల ఆధారంగా మ్యాచ్ డ్రాగా ముగిసినా, లేదంటే టై అయినా కూడా రెండు టీమ్‌లను జాయింట్ విన్నర్స్‌గా ప్రకటిస్తామని ఐసీసీ గ్లోబల్ బాడీ తెలిపింది. అంతేకాదు రిజర్వ్‌డే నిబంధనను పక్కనపెట్టేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ రెండు నిర్ణయాలు ఇప్పటికిప్పుడు తీసుకున్నవి కాదని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రకటన కంటే ముందు జూన్ 2018లోనే తీసుకున్న నిర్ణయాలేనని ఐసీసీ తెలిపింది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ ఉంచాలనే ప్రతిపాదను తొలుత ఐసీసీ పరిశీలించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 5 రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే 6వ రోజు కూడా మ్యాచ్ కొనసాగించే ఆలోచనలో ఐసీసీ ఉందట.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం వచ్చేనెల 18వ తేదీన ఇంగ్లండ్ సౌతాంప్టన్‌లోని హ్యాంప్‌షైర్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లూ తలపడనున్నాయి. ఇప్పటికే బయో బబుల్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్లు.. జూన్ 2న విమానం ఎక్కనుండగా.. కివీస్ ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్ పూర్తి చేశారు. టెస్ట్ క్రికెట్ ఆడే హోదా ఉన్న అన్ని జట్ల నుంచి అత్యధిక పాయింట్లను టీమిండియా, కివీస్ జట్లు ఫైనల్‌కు చేరాయి. తొలిసారిగా ఛాంపియన్‌షిప్‌ను జరుపుగుతుండడంతో ఈ టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూసున్నారు. మరి మ్యాచ్ ఏ స్థాయిలో వారిని అలరిస్తుందో చూడాలి.