Srirama Raksha Stotram- కాకినాడ, ఏప్రిల్ 4: ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలైన అనేక ఆర్షభారతీయ ధార్మిక గ్రంధాలు ఇటు తిరుమల నుండి సింహాచలం వరకూ అనేక క్షేత్రాల్లో, ఆలయాల్లో పవిత్రంగా గత దశాబ్దన్నర కాలంగా పవిత్రంగా హల్ చల్ చేస్తున్నాయి.
ఈ అద్భుతంలో భాగంగా గత ఆదివారం విశ్వావసు నామ తెలుగు ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక క్షేమంకరమైన పాలనకోసం హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సహృదయ సౌజన్యంతో పరమాద్భుతమైన తిరుమల క్షేత్ర ‘అదివో అల్లదివో’ దివ్య గ్రంధాన్ని పిఠాపురంలో అనేక మంది జనసేన నాయకులకు, కాకినాడ తెలుగు దేశం పాలక శ్రేణులకు వందల సంఖ్యలో పంచిన జనసేన పిఠాపురం నియోజక వర్గం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ని అందరూ అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమరావతి, విజయవాడలలో నాలుగు రకాల అఖండ గ్రంధాలతో పవన్ కళ్యాణ్‌కి తిరుమల శ్రీనివాసుడు బొల్లినేని కృష్ణయ్య రూపంలో ఆశీర్వచనాలు అందించేలా ఈ అద్భుత గ్రంధాలు దర్శనమివ్వడం ఆనందకరమన్నారు. ఈ సందర్భంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనలు నభూతో నభవిష్యత్‌గా కనిపించడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు.

శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రభగవానుని అద్భుత స్తోత్రమైన శ్రీరామ రక్షాస్తోత్రమ్ వేల కొలది ప్రతులను పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, అనపర్తి పట్టణాల సీతారామకల్యాణోత్సవాలలో పంచనున్నట్లు మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి కృష్ణార్జునుల్లా విరామమెరుగక పరిశ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ ఈ పవిత్ర గ్రంథ వితరణలో ఎంతో స్ఫూర్తి కలిగించిన బొల్లినేని కృష్ణయ్య, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గతంలో పురాణపండ శ్రీనివాస్ రచనల్ని భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులు ఆవిష్కరించి అభినందనలు అందజేయడం విశేషం.