గతేడాది ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేసిన కరోనా భారత్‌ను అంతగా బాధించలేదు. కానీ ఈ ఏడాది మాత్రం ప్రపంచంలోని మూరు మూల పేద దేశాలు సైతం భారత్‌ను చూసి బాధపడేటంతగా దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలో ప్రతి రోజూ లక్షల కేసులు, వేల మరణాలు.. కుటుంబ సబ్యుల ఆర్తనాదాలు, ఆసుపత్రుల వద్ద పడిగాపులు.. దేశ వ్యాప్తంగా ఇదే దుస్థితి. ఎప్పుడు ఏ భయంకరమైన వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలంతా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బయాందోళనల్లో బతుకుతున్నారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ వల్లే ఇంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటుంటే.. థర్డ్ వేవ్ కూడా వస్తుందని, అది సెకండ్ వేవ్ కంటే ప్రమాదకరమని, అంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ జూన్ చివరినాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని.. అయితే నెలల వ్యవధిలో నవంబర్‌లోనే మరోసారి కరోనా విజృంభించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రాణాలపై ఆశ కూడా చచ్చిపోతోంది. అయితే దీనిని అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా కొనసాగించాలని, ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను పటిష్ఠపరచుకోవాలని, అప్పుడే మూడో ముప్పు నుంచి తప్పించుకోగలుగుతామని సూచిస్తున్నారు.
కరోనా థర్డ్ వేవ్ విజృంభణకు సంబందించి ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ.. ‘వైరస్ నుంచి కోలుకున్న తర్వాత వచ్చే ఇమ్యూనిటీ 3 నుంచి 6 నెలలు ఉంటుంది. తర్వాత అదే వ్యక్తి మరోసారి వైరస్ బారినపడే ప్రమాదం ఉంటుంది. శరీరంలోకి ప్రవేశించే వైరస్ పరిణామం ఆధారంగా రీఇన్‌ఫెక్షన్ స్థాయి ఉంటుంది. దేశంలో కొందరు ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు కూడా రెండోసారి వైరస్ బారినపడ్డారు. ఇమ్యూనిటీ రక్షణ శాశ్వతంగా ఎవ్వరికీ ఉండదు’ అని పేర్కొన్నారు. అందువల్ల మరో 5 -6 నెలల తర్వాత మరో ముప్పు వచ్చే ప్రమాదం ఉందని, అప్పటికి ప్రజల్లో రోగనిరోధకత తగ్గే ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే మళ్లీ నవంబర్ నెల ఆందోళనకరమైందని అంచనా వేశారు.
దేశంలో ముప్పైఏళ్ల వయసుపైబడిన 80శాతం మందికి వ్యాక్సిన్ అందించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రొఫెసర్ మూర్తి పేర్కొన్నారు. ఇదే సమయంలో చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలను ముమ్మరం చేయాలన్నారు. అంతేకాకుండా భారీ సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలపై వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరి వరకు నిషేధం విధించాలని స్పష్టం చేశారు. ఇది జిల్లా స్థాయి నుంచి జరిగితేనే సరైన ఫలితాలు సాధ్యమవుతాయిన సూచించారు. అయితే పాఠశాలలు, కార్యాలయాలను మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించుకోవచ్చని సూచించారు.