కరోనా ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే కరోనాకు సంబంధించినే రకరకాల వేరియంట్స్ వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు అల్లకల్లోలం అవుతుంటే.. కొత్తగా కరోనా హైబ్రిడ్ రకం బయటపడింది. ఈ హైబ్రిడ్ రకం వ్యాప్తి కూడా చాలా ప్రమాదకరంగా జరుగుతోందట. అంతర్జాతీయ మీడియాలో దీనిపై ఇప్పటికే అనేక రకాలకథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో ప్రజలతో తీవ్ర భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు.
వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఉంటాయి. కరోనా కూడా ఇప్పటికే అనేకాసార్లు రూపం మార్చుకుంటోంది. వాటినే మనం వేరియంట్లు అంటున్నాం. సాధారణంగానే మొదట వచ్చిన వైరస్‌లకంటే ఆ తర్వాత మ్యూటేషన్‌తో వచ్చే వైరస్ మరింత ప్రమాదకరంగా ఉంటుంది. కరోనా విషయంలోనూ ఇదే జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్‌కు కారణం కూడా ఈ వేరియంట్లే. అయితే తాజాగా శాస్త్రవేత్తలు మరో కొత్త కరోనా వేరియంట్‌ను కనుగొన్నారు. అయితే ఇది మ్యూటెట్ అయిన రకం కాదు. మ్యూటేషన్ చెందిన రెండు కరోనా వేరియంట్ల నుంచి జన్మించిన సరికొత్త హైబ్రిడ్ వైరస్. ఇప్పటివరకు చూసిన కరోనా వేరియంట్లలో ఇదే అత్యంత ప్రమాదకారమైన రకమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ హైబ్రిడ్ వైరస్ ప్రస్తుతం వియత్నాంను వణికిస్తోంది.
తాజాగా బయటపడిన కరోనా హైబ్రిడ్ రకం ఇండియా-ఇంగ్లండ్ వేరియంట్ల నుంచి పుట్టిన సరికొత్త మ్యూటేషన్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాన్ని వియత్నాం హెల్త్ మినిష్టర్ న్యూయెన్ థాన్ ప్రకటించారు. ఇప్పటికే దేశంలో 7 రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారని, ఈ కరోనా వేరియంట్ల వ్యాప్తిని ఇప్పటివరకు కట్టడి చేశామని, కానీ ఈ కొత్త హైబ్రిడ్ రకం మ్యూటెంట్‌ను అడ్డుకోవడం సాధ్యం కావడం లేదని థాన్ వెల్లడించారు.
ఇప్పటికే వియత్నాంలోని 63 నగరాల్లో 31 నగరాలు కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి. 6,396 మంది కరోనా బారిన పడగా 47 మంది మరణించారు. వీరి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు వారికి సోకింది కొత్త రకం కరోనా వేరియంట్ అని గుర్తించారు. దానిని పరిశీలించగా.. ఇండియా-ఇంగ్లండ్ దేశాల్లో బయటపడిన ప్రమాదకరమైన వేరియంట్ల లక్షణాలు రెండూ అందులో ఉన్నాయని, దీనివల్లనే తమ దేశంలోని అధికశాతం ప్రజలు వైరస్ బారిన పడ్డారని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా ఈ హైబ్రిడ్ వైరస్ తన పేరెంట్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తోందని, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరి సోకే లక్షణం ఈ హైబ్రిడ్‌కు ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ హైబ్రిడ్ రకం వల్ల ప్రాణాలకు మరింత ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ హైబ్రిడ్ వేరియంట్‌కి సంబంధించిన సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేస్తామని వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది.