కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా కోట్ల మంది దాని కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ ఉధృతి ఫస్ట్ వేవ్ కంటే దారుణంగా ఉంది.
అయితే ఒకపక్క కరోనా సోకి ప్రాణాల కోసం ఆసుపత్రులకు వెళతుంటే మరో పక్క ఇదే అదనుగా ఆసుపత్రులు అందినకాడికి దండుకుంటున్నాయి. ఇది కేవలం మనదేశంలో మాత్రమే ఉన్న దౌర్భాగ్యం కాదు.
అగ్రరాజ్యం అమెరికాలోనూ అదే తరహా దారుణ పరిస్థితులున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి బయటపడింది.
ఓ కోవిడ్ పేషంట్‌కు ట్రీట్మెంట్ ఇచ్చినందుకు అమెరికాలోని ఓ ఆసుపత్రి ఏకంగా రూ.22 కోట్ల బిల్ వేసింది. మీరు నోరెళ్ల బెట్టినా.. ఇది నిజం.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఓ వ్యక్తి కరోనా సోకిందని ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో 4 నెలల చికిత్స అనంతరం అతను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు.
ఇక డిశ్చార్జ్ సమయంలో అతనికి ఆసుపత్రి యాజమాన్యం బిల్ ఇచ్చింది. అది చూడగానే అతడికి గుండె ఆగినంత పనైంది.
ఎందుకంటే అందులో ట్రీట్మెంట్ బిల్ 3 మిలియన్ డాలర్లుగా ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.22 కోట్లన్నమాట.
బిల్ చూసిన ఆ పేషెంట్ బెంబేలిత్తిపోయాడు. అయితే ఆ రసీదుని వీడియో తీసి ‘టిక్‌టాక్’లో పోస్టు చేశాడు.
ఈ వీడియో వైరల్‌గా మారి కొద్ది రోజుల్లోనే దాదాపు 10 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించుకుంది.
కాగా.. ఈ వీడియోను ఫేక్ వీడియో అంటూ కూడా కొంతమంది కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ఏదో ప్రాంక్ కోసం తీసిన వీడియో అని అంటున్నారు.
అయితే ఎక్కువ శాతం మాత్రం అమెరికాలో వైద్యం అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అంటూ సెటైర్లు వేస్తున్నారు.