గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న ‘ఫ్లయింగ్ సాసర్లు’ భూమిని సందర్శించి వెళుతున్నట్లు కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. గడిచిన రెండు దశాబ్దాలుగా దాదాపు 120 ఘటనలు వెలుగుచూసినట్లు సమాచారం. అత్యంత వేగంతో కనిపించి అదృశ్యమయ్యే ఇలాంటి వస్తువులకు సంబంధించిన ఘటనలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. 2019లో అమెరికా యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టిముట్టినట్లు పరిశోధనాత్మక లఘుచిత్రాల దర్శకుడు జెరిమీ కార్బెల్ పేర్కొనడం మరోసారి చర్చకు దారితీసింది. రాడార్ చిత్రాల్లో కనిపించిన ఆ దృశ్యాలను అమెరికా రక్షణశాఖ కూడా ధ్రువీకరించింది. తాజాగా వీటిపై అమెరికా ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేయనుండడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
యూఎఫ్‌ఓలపై విచారణ జరిపేందుకు అమెరికా ఇప్పటికే ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ నెల 25న తన నివేదికను వెలువరించే అవకాశం ఉంది. అయితే, మిస్టరీ వస్తువులకు సంబంధించి ఇప్పటివరకు తనకు తెలిసిన విషయాలపై అమెరికా ప్రభుత్వం తొలిసారి నివేదిక విడుదల చేయడానికి సిద్ధమవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కొన్ని విషయాలను ఓ సీనియర్ అధికారి ‘ది న్యూయార్క్ టైమ్స్’తో పంచుకున్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కనిపించిన వస్తువులు పెంటగాన్ రహస్య సాంకేతిక విభాగానికి చెందినవి కావని నిర్ధారించామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను గ్రహాంతరవాసులు (ఏలియన్స్) చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, వాటిని కొట్టిపారేయలేమని చెప్పారు. ఈ మాటలతో గ్రహాంతర వాసుల విషయంలో ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది.
అమెరికాలో వెలుగుచూస్తోన్న ఇటువంటి ఘటనల వెనుక చైనా, రష్యా దేశాల హస్తం ఉందా? అన్న కోణంలోనూ అమెరికా రక్షణశాఖలో చర్చ
జరుగుతోంది. ముఖ్యంగా హైపర్‌సోనిక్ సాంకేతికత సహాయంతో చైనా లేదా రష్యా ప్రయోగాలు చేసి ఉండొచ్చని అమెరికా నిఘా విభాగంతో పాటు సైన్యం భావిస్తున్నట్లు నివేదికపై స్పందించిన మరో అధికారి పేర్కొన్నారు. ఇలా గ్రహాంతరవాసులపై భిన్న కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అమెరికా సైన్యం మాత్రం ఇటువంటి ఘటనలను యూఎఫ్‌వోలు అని కాకుండా కేవలం అన్-ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా అంటే ఆకాశంలో జరిగిన గుర్తించలేని విషయాలుగా మాత్రమే చెబుతోంది. మరి వీటికి సరైన ఆధారాలు ఎప్పటికి వెలుగులోకి వస్తాయో చూడాలి.