ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఓ వింత ఘటన వెలుగులోకొచ్చింది. ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఎంతో లబ్ధి చేకూరుస్తున్నమని చెప్పుకుంటున్న సర్కార్ తాజా ఘనకార్యం చేసింది. ఓ లబ్ధిదారురాలికి కేవలం రూ.19 వేలు అందించి, దానికి రూ.10 లక్షలు అందించినట్లు పేర్కొంటూ ఓ పాంప్లేట్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడా పాంప్లేట్ వైరల్ అవుతోంది. జీ సిగడాం మండలంలోని వాండ్రంగి గ్రామానికి చెందిన కంది ఆదిలక్ష్మి అనే మహిళకు చెందిన వివరాలన్నీ ఈ పాంప్లేట్‌లో ఉన్నాయి.
ఆ వివరాల ప్రకారం.. ఆమెకు ప్రభుత్వ పథకాలైన పింఛన్ తదితర పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోంది. అలాగే వాటితో పాటు ఇంటిస్థలం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 లక్షలు ఆమె కోసం ఖర్చు చేసినట్లుగా చూపించారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ బయటపడింది. నిజానికి ఆమె సొంత స్థలంలోనే ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఆమె ఖాతాలో గృహనిర్మాణశాఖ అధికారులు కేవలం రూ.19 వేలు మాత్రమే వేశారు. అంటే కేవలం రూ.19వేలిచ్చి లెక్కల్లో మాత్రం రూ.10 లక్షలు చూపించారన్నమాట.
ఇదిలా ఉంటే గురువారం నుంచి ఈ విషయంలో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా కరపత్రంలో పేర్కొన్న నగదు తమకు రాలేదని లబ్ధిదారు వాపోయారు. దీనిపై ఎంపీడీవో రమణమూర్తిని వివరణ కోరగా అమరావతి నుంచి వచ్చిన కరపత్రంలో తప్పులు దొర్లాయని, సచివాలయ సిబ్బందితో మాట్లాడి వివరాలు సరిచేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ‘ఎంత తప్పులు దొర్లినా.. రూ.10 లక్షల మేరనా..?’ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ తప్పు ఇక్కడ మాత్రమే జరిగిందా..? లేక ఇంకా వేరే చోట్ల కూడా ఇలాంటి తప్పులే దొర్లాయా..? అనేది తెలియాల్సి ఉంది.