అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మందుల వల్ల ఎలాంటి హాని లేదని సీసీఆర్ఏఎస్ నివేదిక తేల్చడంతో ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చింది. అయితే కంట్లో వేసే మందుకు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ డ్రాప్స్‌పై ఇంకా నివేదికలు రాలేదని, పూర్తి నివేదికలు రావాలంటే మరో 2 – 3 వారాల సమయం పడుతుందని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. దీంతో కంటి డ్రాప్స్ మినహా మిగిలిన మందులకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆనందయ్య మందు వాడినప్పటకీ.. మిగిలిన మందులను అశ్రద్ధ చేయొద్దని, అన్ని రకాల మందులనూ క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ ఇష్టమైనవారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని చెప్పింది. అలాగే మందు పంపిణీలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని సుచించింది. అంతేకాకుడా కోవిడ్ పాజిటివ్ ఉన్నవారు ఈ మందుకోసం రావద్దని, వారి కుటుంబ సభ్యులెవరైనా వచ్చి మందు తీసుకెళ్ళాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
హైకోర్టు కూడా..
తన మందుపై ఆనందయ్యతో పాటు మరో ఇద్దరు వేసిన పిటిషన్‌పై ఈ రోజు ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు కోరింది. ఈ విషయంపై నేడు ప్రభుత్వం సమీక్ష జరుపుతుందని న్యాయవాది వివరించారు. చట్ట ప్రకారం ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిలో వేసే డ్రాప్స్‌పై గురువారంలోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తీర్పునిచ్చింది.