దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందు వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మందు కోసం వేల మంది ఎగబడుతుండంతో ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ, ఆయుష్, ఐసీఎంఆర్‌లు దీనిపై దృష్టి సారించాయి. ఈ మందు శాస్త్రీయతపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే మందు పంపిణీని నిలిపివేసి.. పరీక్షలు సైతం మొదలు పెట్టాయి ఆయా సంస్థలు. అయితే ఆనందయ్య, అతడి మందుకు మద్దతు తెలిపే వారూ ఉన్నారు. విమర్శలు గుప్పించే వారూ ఉన్నారు. తాజాగా విమర్శించే గ్రూపులో చేరాడు బాబూ గోగినేని.
ఈ క్రమంలోనే వరుస ఫేస్ బుక్ వేదికగా ఆనందయ్యకు, అతడి మందుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ తెగ రచ్చ చేస్తున్నాడు. అది ఆనందయ్య మందు కాదని, ఆనందయ్య చట్నీ అని విమర్శలు చేస్తున్నాడు. ప్రజల్లో అనేకమంది కరోనా వైద్యం కోసం భారీగా ఖర్చు చేసే స్థాయిలో లేరని, అందువ్ల నిస్సహాయులై ఆనందయ్య మందుకోసం ఎగబడుతున్నారని, అంతేకానీ వారికి ఆ మందంటే ఇష్టమై కాదని విమర్శించారు.
తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్టులో.. ‘ఆనందయ్యను, అతనిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను, ప్రచారం కలిపించిన టీవీ ఛానళ్లను, వాటి అంకర్లను అందరినీ ప్రజా బాహుళ్యం లో కరోనా వ్యాప్తికి, లాక్ డౌన్ మెల్ట్ డౌన్ కు, ఇంతమందికి ఇన్ని కష్టాలు, నష్టం కలుగ చేసినందుకు, ఇప్పుడు జరుగుతున్న, ముందు ముందు జరగబోతున్న మరణాలకు బాధ్యులు చేయాలి.
ఇంకా: ఆగు, అప్పుడేనా, ఇప్పుడే ఎందుకు అది ప్రమాదం అంటున్నావు, కాస్త ఆగు, దేశం, ధర్మం, వేదం, ఆయుర్వేదం అని ఉచిత సలహాలు, హెచ్చరికలు ఇచ్చిన వాళ్ళని ఏమి చేయాలో ఆలోచించండి. విషయం తెలియక, కాస్త భయంతో, కాస్త ఆశతో, చాలా ఉన్మాదం తో వీరందరూ ప్రజాభిప్రాయాన్ని ప్రజారోగ్యానికి వ్యతిరేకంగా మార్చేసారు.
నేను చెప్పాను, నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను, వేలం వెర్రిని తక్షణం ఆపండి అని. చెప్పాను, పది రోజులు ఆగండి వీరందరూ చేసిన బీభత్సం స్థాయి పూర్తిగా తెలుసుకోవడానికి అని. మీడియా తెలిపితే.
టీవీ 9 ప్రకారం 70 మంది హాస్పిటల్ లో చేరారు. ప్రజాశక్తి పత్రికలో వరుస కథనాలు ప్రచురిస్తున్నారు. ఇది వేరే పత్రికలలో రాలేదా, ఇంకే ఛానల్ లో వచ్చింది అని నన్ను అడగవద్దు. మీరే వెతుక్కొండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీకు కనపడకపోవచ్చు కానీ, శవాలను దాయడం కష్టం’ అని పేర్కొన్నాడు. దీనికి ప్రజాశక్తిలోని కొనని పేపర్ క్లిప్స్‌ను కూడా జత చేశాడు.