టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో జట్టుకు ఆడుతున్న సమయంలో తనపై ద్రవిడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గుర్తు చేసుకున్నాడు. తాను తాను ‘fcuk’ అనే అక్షరాలు రాసి ఉన్న టీ షర్ట్ ధరించడంతో తనపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడని రైనా చెప్పాడు. ఈ విషయాన్ని తన జీవిత కథ ‘బిలీవ్’లో రాసుకొచ్చాడు. ద్రవిడ్ కోపంతో తనకు భయమేసిందని, వెంటనే డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి ఆ టీషర్టును తీసి డస్ట్‌బిన్‌లో వేసేశానని, వెంటనే వేరే టీ షర్ట్ వేసుకుని బయటకొచ్చానని రైనా చెప్పుకొచ్చాడు.
2006లో ఆసీస్, విండీస్‌లతో ట్రై సిరీస్ సందర్భంగా ద్రవిడ్ కెప్టెన్సీలోనే మలేషియా టూర్ వెళ్లాం. అదే సమయంలో ‘fcuk’ అక్షరాలున్న టీ షర్ట్ వేసుకుని ఆయన కంట పడ్డాను. వెంటనే నాపై ఆయన అరిచేశారు. ‘నువ్వు ఎలాంటి దుస్తులు ధరించి, ఎక్కడ తిరుగుతున్నావో తెలుసా? నువ్వొక భారత క్రికెటర్‌వి. అలాంటి పదాలు రాసున్న టీషర్టులు ధరించి నువ్వు బయట తిరగకూడదు’ అని ద్రవిడ్ తనను మందలించాడని రైనా రాశాడు. ‘ఆ సమయంలో నేనెంతో భయపడ్డాను. వెంటనే డ్రస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాను. దుస్తులు మార్చుకొని టీషర్టును చెత్తకుండీలో పారేశాను’ అని అతడు గుర్తు చేసుకున్నాడు.
భారత ఆటగాళ్లు బయట హుందాగా ఉండాలన్నదే ద్రవిడ్ ఉద్దేశమని రైనా తెలిపాడు. దేశానికి ఆడటం మిస్టర్ డిపెండబుల్ ఎంతో గౌరవంగా భావిస్తారని పేర్కొన్నాడు. క్రికెటర్లు భారతదేశానికి ప్రతినిధులని, ఎంపిక చేసుకొనే దుస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నది ఆయన కోరికగా చెప్పాడు. ఇక నెట్స్‌లో సాధన చేసేటప్పుడు ద్రవిడ్ సీరియస్‌గా ఉంటారని అన్నాడు. కాగా.. సురేశ్ రైనా 2005లో ద్రవిడ్ సారథ్యంలోనే టీమిండియాలోకి అడుగు పెట్టాడు. కెరీర్లో 18 టెస్టులు ఆడి 768 పరుగులు, 226 వన్డేలాడి 5,615 పరుగులు, 78 టీ20లు ఆడి 1,605 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రైనా 5,491 పరుగులు చేశాడు. ఇటీవలే తన చిరకాల మిత్రుడు, టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.