ఢిల్లీ పోలీసులకు ఎంపీ రఘురామ ఫిర్యాదు చేయడంపై సీఐడీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ విషయంలో ఆయన చెబుతున్న విషయాలన్నీ అసత్యాలని అన్నారు. రఘురామ తమకు చెప్పిన విషయాలు, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదు చేసిన విషయాల్లో చాలా తేడా ఉందని అన్నారు. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా ఆయన వ్యవహరిస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్‌ను సీఐడీ సీజ్ చేసిందని రఘురామ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారని, అయితే తన నెంబర్ బదులు వేరే నెంబర్‌ను తనదిగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారని సీఐడీ అధికారులు ఆరోపించారు.
‘గత నెల రఘురామ మాకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉంది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉంది’’ అంటూ సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మే 15న రఘురామ మొబైల్(ఐఫోన్ 11) స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్నది ఫలానా నెంబర్ అని రఘురామ చెప్పారు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్‌మెంట్ నమోదు చేశాం. మొబైల్ ఫోన్ సీజ్ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపాం. రఘురామ యాపిల్ ఫోన్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌కు పంపించాం. రఘురామ ఫోన్ డాటాను మే 31న కోర్టుకు అందించాం. కానీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు ఆయన చేసిన ఫిర్యాదులో వేరే నెంబర్‌ను తనదిగా పేర్కొన్నారు. ఇది దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేందుకేన’’ని సీఐడీ ఆరోపించింది.
ఇదిలా ఉంటే ఎంపీ రఘురామకృష్ణరాజుకు దేశవ్యాప్తంగా అనూహ్య మద్దతు వస్తోంది. ఎంపీ రఘురామ అరెస్ట్ తరువాత.. పరిస్థితులను వివరిస్తూ అన్ని రాష్ట్రాల సీఎంలకు, ఎంపీలకు ఆయన లేఖలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన లేఖపై బిహార్ సీఎం నితీశ్ స్పందించారు. రఘురామ లేఖను బిహార్ సీఎస్, డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శులకు బిహార్ సీఎం కార్యాలయం పంపింది.