టీమిండియా మాజీ కెప్టెన్ ఒకప్పటి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గురించి భారత క్రికెట్లో తెలియని వారుండరు. సచిన్ టెండూల్కర్ కంటే ముందు తరం క్రికెటర్ అయిన గవాస్కర్.. భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. బ్యాటుతో మ్యాజిక్ చేయడం, ప్రత్యర్థిపై ఎదురు దాడికి దిగడం గవాస్కర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే అంతటి గొప్ప ఆటగాడైనా.. రిటైర్మెంట్ తరువాత గవాస్కర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోచ్‌గా చేయలేదు. టీమిండియాకే కాదు, కనీసం ఏ రంజీ జట్టుకు కూడా కోచ్‌గా చేయలేదు. ఇది క్రికెట్ అభిమానులకు కొంత ఆశ్చర్యం కలిగించినా.. గవాస్కర్ మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. అంతేకాదు.. తాను క్రికెట్ కోచ్ ఎప్పటికీ కాలేనని ఇటీవల ఆయననడంతో అంతా అవాక్కయ్యారు. సునీల్ గవాస్కర్‌కున్న క్రికెట్ పరిజ్ఞానం అపారం. అయితే ఇప్పటివరకు ఆయన ఏ జట్టుకూ కోచ్‌గా పనిచేయలేదు. తన సహచర ఆటగాళ్లైన కపిల్ దేవ్, అజిత్ వాడేకర్, బిషన్ సింగ్ బేడీ వంటి వారు కోచ్‌లుగా పనిచేసినా గవాస్కర్ మాత్రం ఎప్పుడూ అటు వైపు దృష్టి సారించలేదు.
దాని గురించి సునీల్ తాజాగా స్పందించాడు. `నేను కోచ్‌గా రాణించలేను. ఎందుకంటే నేను ఆటను ఎక్కువసేపు చూడలేను. నేను ఆడే రోజుల్లో కూడా మ్యాచ్ పూర్తిగా చూసేవాడిని కాదు. అవుట్ అవగానే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేవాడిని. నేను ప్రతి బంతినీ చూసే రకం కాదు. కోచ్ కావాలంటే ప్రతి బంతినీ చూడాలి. అన్నీ గమనించాలి. నేను అలా చేయలేను. నాకు కోచింగ్‌పై ఆసక్తి లేకున్నా నా వద్దకు సలహాలు, సూచనలు కోసం వచ్చే ఆటగాళ్లతో మాట్లాడేవాడిని. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో ఎంతో ఇష్టంగా నా ఆలోచనలను పంచుకునేవాడిన`ని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.