Sunday, March 22, 2026

ద్రవిడ్ ఈజ్ బెస్ట్.. పాక్ మాజీ కెప్టెన్

భారత క్రికెట్ చరిత్రలో టీమిండియా తరపున రెండు జట్లు బరిలోకి దిగనున్న విషయం తెలిపిందే. ప్రధాన జట్టు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లండ్ వెళ్లనుండగా.. రెండో జట్టు శ్రీలంక వెళ్లనుంది. ఇంగ్లండ్ వెళ్లే జట్టుకు ఎప్పటిలానే రవిశాస్త్రి కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కాగా.. రెండో జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండనున్నాడు. ఇన్నాళ్లు టీమిండియా-ఏ జట్టుకు, అండర్ 19 జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్.. ఇప్పుడు టీమిండియా కోచ్‌గా మారడంపై అనేకమంది మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా చేరాడు.

శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్‌గా ద్రవిడ్‌ సరిగ్గా సరిపోతాడని.. అతని మార్గనిర్దేశనంలో జట్టు అదరగొడుతుందని ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. ఈ విషయం తానెప్పుడో చెప్పానని, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఇంజమామ్ అన్నాడు. ‘ద్రవిడ్‌ అండర్‌-19 గ్రూప్ నుంచి ఎందరో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేశాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా రెండో జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్లలో చాలావరకు ద్రవిడ్‌ శిక్షణలో రాటుదేలిన వారే. వారి నుంచి ఆటను ఎలా రాబట్టాలనేది అతనికి బాగా తెలుసు. ఆటగాళ్లు కూడా ద్రవిడ్‌తో మంచి అనుబంధం ఉన్న కారణంగా ఇట్టే కలిసిపోతారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎక్స్‌పరిమెంట్స్‌ చేస్తే మంచిది. ఎందుకంటే సీనియర్లు లేని లోటు తెలియాలంటే బ్యాకప్‌ బెంచ్‌ కూడా పటిష్టంగా ఉంచుకోవాలి. బీసీసీఐ మంచి ప్రణాళికతో ముందుకెళుతుంది.. వీరిని చూసి ఇతర క్రికెట్‌ బోర్డులు అదే దారిని ఎంచుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే కోచ్ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. కెప్టెన్ విషయం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో టీమిండియా రెండో జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పజెబుతారన్న విషయం ఆసక్తిగా మారింది. కాగా..కెప్టెన్సీ రేసులో శిఖర్‌ ధవన్‌, హార్దిక పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌లు ఉన్నారు. దీంతో కెప్టెన్సీ ఎవరికిస్తారనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. అయితే జట్టులో అనుభవం దృష్యా ధవన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సీనియర్‌ జట్టు న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సన్నద్ధమవుతోంది. దీనికోసం జూన్‌ 2న ఇంగ్లండ్‌ వెళ్లనున్న టీమిండియా.. జూన్‌ 18 నుంచి 22 వరకు కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -