Sunday, March 22, 2026

‘చంద్రేశ్వర’ మూవీ రివ్యూ

మూవీ పేరు: ‘చంద్రేశ్వర’
విడుదల తేదీ: 27 జూన్, 2025
నటీనటులు: సురేశ్ రవి, ఆశ వెంకటేష్, నిళల్‌గళ్ రవి, బోసే వెంకట్, ఆడుకాలం మురుగదాస్, జెఎస్‌కె గోపి తదితరులు
సంగీతం: జెరాడ్ ఫిలిక్స్
డిఓపి: ఆర్వీ సీయోన్ ముత్తు
ఎడిటర్: నందమూరి హరి
నిర్మాత: డా. రవీంద్ర చారి
డైరెక్టర్: జీవీ పెరుమాళ్ వర్ధన్

ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే కోణంలో చాలా ఛేంజ్ వచ్చింది. కంటెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. రొటీన్ చిత్రమే అని టాక్ వస్తే చాలు, ఆ సినిమా వైపు అసలు చూడను కూడా చూడటం లేదు. ఓటీటీలు వచ్చిన తర్వాతే ఈ మార్పు వచ్చింది. కొన్ని రోజులుగా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్‌తో వస్తున్నట్లుగా ‘చంద్రశ్వేర’ మూవీ టీమ్ చెబుతూ వస్తుంది. అందులోనూ ‘కన్నప్ప’కు పోటీగా థియేటర్లలోకి దిగడంతో ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ట్రైలర్, పాటలు ఆసక్తికరంగా ఉండటంతో పాటు శివుడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందనేలా చెబుతూ మేకర్స్ చేసిన ప్రమోషన్స్‌.. సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. అందులోనూ ఆర్కియాలజీ నేపథ్యంలో పురాతన కాలం నాటి ఓ గుడికి సంబంధించిన స్టోరీ లైన్‌తో ‘చంద్రేశ్వర’ తెరకెక్కిందని, ఈ సినిమా అందరూ చూడాలని మేకర్స్ చెబుతూ వచ్చారు. మరి ఇందులో ఉన్న విషయం ఏమిటి? అది ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుంది? బాక్సాఫీస్ వద్ద నిలబడే సత్తా ఈ ‘చంద్రేశ్వర’లో ఉందా? అనేది మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
నందివర్మ పర్వతం కింద పురాతన కాలంనాటి ఓ గుడి కప్పెట్టబడి ఉందని, ఆ గుడి లోపల నిధి ఉందని తెలిసి ఆర్కియాలజీ విభాగానికి చెందిన ఎమ్‌డి చక్రవర్తి (నిళల్‌గళ్ రవి), ఓ టీమ్‌ని ఆ పర్వతం ఉన్న చంద్రగిరికి పంపిస్తాడు. ప్రొఫెసర్ బోస్ (బోసే రవి) ఆధ్వర్యంలో అతనితో కలిపి 8 మంది టీమ్ ఆ గ్రామానికి వెళుతుంది. కానీ, ఆ గ్రామ ప్రజలు, వారిని ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. అంతకు ముందు కూడా ఇలాగే కొందరు వచ్చి చేసిన పనులతో ఊరిలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారని అడ్డుకుంటారు. ఎలాగోలా వారిని ఒప్పించి, బోస్ టీమ్ అక్కడ తవ్వకాలను చేపడుతుంది. కాకపోతే చీకటి పడిన తర్వాత ఆ గ్రామంలో ఎవరూ తిరగకూడదు. ఎవరైనా అలా ప్రయత్నిస్తే దారుణంగా చనిపోతుంటారు. అప్పుడే చంద్రగిరి‌కి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన గురు వర్మ (ఆశ వెంకటేష్), ఆ చావులు వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి, తన స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఆర్కియాలజీ టీమ్‌లోని అఖిల (ఆశ వెంకటేష్)‌తో ప్రేమలో పడతాడు. ఇక తన ఇన్విస్టిగేషన్‌లో గురు వర్మ సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఆ విషయాలు ఏంటి? ఆ ఊరిలో చావులకు కారణం ఏంటి? గురు వర్మ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు? నిజంగానే ఆ గ్రామంలో గుడి, అందులో నిధి ఉన్నాయా? వంటి విషయాలు తెలియాలంటే మాత్రం ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లున్న ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సురేష్ రవి ఆహార్యం బాగుంది. ఫస్ట్ సీన్‌లోనే అతని టాలెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం బాగుంది. ఆ తర్వాత చంద్రగిరి వచ్చినప్పటి నుంచి ఆయన చేసే ఇన్విస్టిగేషన్ అందరినీ సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎందుకంటే, ఆ ట్విస్ట్‌లన్నింటికీ చెక్ పెట్టేది అతనే. పురాతన గ్రాంథిక భాష తెలిసిన ఎక్స్‌పర్ట్‌గా ఆర్కియాలజీ టీమ్‌లో కీలక పాత్ర పోషించే అఖిల పాత్రలో ఆశ వెంకటేష్ మెప్పిస్తుంది. తన అందంతోనూ, అలాగే ప్రేమికురాలిగా, టీమ్ సభ్యురాలిగా వైవిధ్యంగా కనిపించే అవకాశం ఆమెకు దక్కింది. చక్రవర్తిగా నిళల్‌గళ్ రవి, ప్రొఫెసర్‌ బోస్‌గా బోసే రవి, గ్రామ పెద్దగా చేసిన అతను, ఇంకా ఆర్కియాలజీ టీమ్ మెంబర్స్ అంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన హైలెట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సినిమా కొద్దిగా డౌన్ అవుతున్న ప్రతిసారి సంగీత దర్శకుడు అలా నిలబెట్టేశాడు. శివుడిపై వచ్చే ఓ సాంగ్ అయితే గూజ్‌బంప్స్ తెప్పిస్తుంది. అఖిల అఖిల పాట పెద్ద హీరోకు పడాల్సిన పాటలా ఉంది. సినిమాటోగ్రపీ కూడా పురాతన రోజులకు తీసుకెళుతుంది. మొదట్లో వచ్చే విజువల్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని కనబరుస్తాయి. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండొచ్చు. ఉన్నంతలో అయితే సినిమా బాగానే ఉంది. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. దర్శకుడు జీవీ పెరుమాళ్ వర్ధన్ ఈ కథని బాగా రీసెర్చ్ చేసుకుని రాసుకున్నాడనే విషయం ఫస్ట్ షాట్‌లోనే తెలిసిపోతుంది. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ, ఎవరినీ హర్ట్ చేయకుండా ఆయన కథ చెప్పిన విధానం అందరినీ మెప్పిస్తుంది.

విశ్లేషణ:
ఆర్కియాలజీ నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలే వచ్చాయి కానీ, ఇందులో ఆసక్తికరమై కథ, స్క్రీన్‌ప్లేతో చూస్తున్న ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌‌కు ముందు వచ్చే సన్నివేశం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. ఒక్కొక్కరికి గూస్‌బంప్స్ వస్తాయి. సినిమా స్టార్టింగ్ సీనే.. ఒక గొప్ప సినిమా చూడబోతున్నామనే అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత నందివర్మ, విషయ్ గౌడ ఎపిసోడ్.. ఈ సినిమాకు బలం. అది మిస్సయితే ఈ సినిమా ఏం అర్థం కాదు. మేకర్స్ పోస్టర్‌లో ‘ప్రారంభం మిస్ కాకండి’ అని ప్రింట్ చేయించి ఉండాల్సింది. సినిమాపై ఇంకాస్త ఇంట్రస్ట్ వచ్చేది. ఒక రాజుని ఓడించాలంటే.. ముందు వారి ఆచార వ్యవహారాలపై దెబ్బకొట్టాలనే డైలాగ్, సనాతన పద్దతులను చూపించిన విధానం, హిస్టారికల్ ఎవిడెన్స్ వంటి పదాలు, విగ్రహాల మార్పిడి ఇవన్నీ కూడా దర్శకుడి మేధస్సుని తెలియజేస్తాయి. గుడి విశిష్టతను తెలిపే ఎపిసోడ్, అదృశ్య ఖడ్గంతో పాటు నిధి కోసం అఖిల చెప్పే 4 సీక్రెట్ దారులు వంటి వన్నీ కూడా సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. కాస్త పేరున్న నటీనటులు కనుక ఇందులో నటించి ఉంటే, అలాగే ద్వితీయార్థంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ‘కార్తికేయ 2’ తరహాలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసేది. మొత్తంగా అయితే, టికెట్ కొనుక్కుని థియేటర్ లోపలకి వెళ్లిన ప్రేక్షకుడిని ఈ ‘చంద్రేశ్వర’ డిజప్పాయింట్ చేయడు. సరిగ్గా ప్రమోట్ చేసుకుంటే.. ఈ ‘చంద్రశ్వర’ బాక్సాఫీస్ వద్ద ‘విజయేశ్వర’గా మారతాడు.

ట్యాగ్‌లైన్: ‘చంద్రేశ్వర’.. ‘విజయేశ్వర’
రేటింగ్: 3.25/5

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -