మూవీ పేరు: ‘లోపలికి రా చెప్తా’
విడుదల తేదీ: 05 జూలై, 2025
నటీనటులు: కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి తదితరులు
మ్యూజిక్: దేవ్ జాంద్
డిఓపి: రేవంత్ లేవాక, అరవింద్ గణేష్,
ఎడిటర్: వంశీ,
నిర్మాతలు: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్ర
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర
హారర్ జానర్‌లో వచ్చే సినిమాల్లో కంటెంట్ కరెక్ట్‌గా పడితే.. రికార్డులు క్రియేట్ చేయవచ్చు. అంతకు ముందు హారర్ బేస్డ్ సినిమాలు ఎన్ని వచ్చినా, ‘ప్రేమ కథా చిత్రమ్’ తర్వాత ఈ జానర్‌లో వచ్చే సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. హారర్‌ని టచ్ చేస్తూ, కామెడీని మిక్స్ చేయడంతో ఈజీగా ఈ తరహా సినిమాలు ప్రేక్షకులకు రీచ్ అవుతున్నాయి. ఇప్పుడదే ఫార్ములాతో రూపొందిన చిత్రం ‘లోపలి రా చెప్తా’. టైటిల్ పరంగా అడల్ట్ కాన్సెప్ట్ సినిమా అని అందరికీ అనిపిస్తుంది కానీ, ఇది ఫ్యామిలీ అంతా చూసి హాయిగా నవ్వుకునే చిత్రమని ప్రమోషన్స్‌లో మేకర్స్ చెబుతూ వచ్చారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగానే రీచ్ అయింది. శుక్రవారం సెంటిమెంట్ వదిలి, శనివారం థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం ఎలా ఉంది? అసలు ఇందులో ఉన్న విషయమేంటి? బాక్సాఫీస్ వద్ద నిలబడే సత్తా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఈ మధ్యకాలంలో, ఈ జానర్‌లో వచ్చే సినిమాలన్నింటి నేపథ్యం ఒకటే ఉంటుంది. ఒకరు అన్యాయంగా చనిపోవడం, వేరే దేహంలో చేరి.. ఆ అన్యాయానికి కారణమైన వారిని మట్టు బెట్టడం. ఇది లారెన్స్ రూపొందించే కాంచన సిరీస్ చిత్రాలలో కామన్‌గా కనిపించే పాయింట్. ఇందులో కూడా అలాంటి పాయింటే ఉంటుంది. కాకపోతే కాస్త వైవిధ్యంగా ఉంటుంది. బి.టెక్ చదివి ఫుడ్ డెలివరీ బాయ్‌గా వర్క్ చేస్తున్న రామ్ (కొండా వెంకట రాజేంద్ర), ప్రియ (సుస్మిత ఆనాల)ను పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్‌కి రెడీ అవుతాడు. అదే సమయంలో ప్రియ వింతవింతగా ప్రవర్తిస్తూ రామ్‌కు సహకరించదు. రూమ్ నుంచి బయటికి వెళ్లగొడుతుంది. రెండో రోజు కూడా సేమ్ టు సేమ్ అలాగే చేస్తుంది. ఆమెకు ఏదో అయిందని గుడికి, మసీదుకు తిప్పినా ప్రయోజనం ఉండదు. అప్పుడు బ్లాక్ స్పారో దగ్గరకు ప్రియను తీసుకెళతాడు రామ్. ఆమె లోపల వేరే ఒకరు ఉన్నారని, అంతా చేస్తుంది అతనే అని.. అందుకు కారణం కూడా రామ్ అని తెలుస్తుంది. అసలు రామ్ ఏం చేశాడు? ప్రియ లోపల ఉన్న ఘోస్ట్ ఎవరు? ఫైనల్‌గా వారికి శోభనం జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పని తీరు:
మల్టీ టాలెంటెడ్ పర్సన్ కొండా వెంకట రాజేంద్ర ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు నిర్మాతలలో ఒకరిగా, హీరోగా కూడా నటించాడు. ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కూడా అన్నింటికీ న్యాయం చేశాడనే చెప్పుకోవచ్చు. నటుడిగా ఎంత అనుభవం ఉందనేది తెలియదు కానీ, రామ్‌గా ఒక డెలివరీ బాయ్ ఎలా అయితే కనిపిస్తాడో.. అలానే పాత్రలో ఒదిగిపోయాడు. ఒక భర్తగా, ప్రియుడిగా, ఒక మంచి మనిషిగా ఆయన పాత్రకున్న వైవిధ్యకోణాల్లో అలరిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయన నటించినట్లుగా ఉండదు.. మన పక్కన ఉన్న ఫ్రెండ్ ఇబ్బంది పడుతున్నట్లుగానే జీవించేశాడు. డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, పైట్స్ అన్నింటిలో తన ప్రతిభ కనబరిచాడు. ప్రియగా చేసిన సుస్మిత ఆనాల నార్మల్‌గా ఉన్నప్పుడు ఒకలా, ఘోస్ట్ తనలోకి వచ్చినప్పుడు మరోలా.. కనిపించిన తీరు బాగుంది. ఫేస్‌లో కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్‌ని పలికించింది. నైనా పాత్రలో నటించిన మనీషా జష్ణానికి చాలా మంచి పాత్ర పడింది. ఆమె తెరపై కనిపించినంత సేపు ప్రేక్షకులు అలా లీనమైపోతారు. చీరకట్టులో కూడా ఎంత గ్లామర్‌గా కనిపించవచ్చో మనీషా జష్ణాని ఈ సినిమాలో చేసి చూపించింది. సినిమాకు మెయిన్ పాత్ర అంటే ఆమెదే అని చెప్పుకోవాలి. పాత్రకి వంద శాతం ఆమె న్యాయం చేసింది. రుక్మిణిగా చేసిన సాంచి రాయ్ రెండు పాటలకే పరిమితమైంది కానీ, గ్లామర్ ప్రదర్శనతో అందరినీ కట్టిపడేస్తుంది. ఇంకా నైనా భర్తగా చేసిన విక్కీ, రామ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..
ఈ సినిమాకు సంగీతం అందించిన దేవ్ జాంద్ అటు పాటలతోనూ, ఇటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనూ సినిమా హైలైట్స్‌లో ఒకడిగా నిలిచాడు. లేడి పిళ్ల, టిక్ టాక్ సాంగ్స్ యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్. కెమెరా వర్క్ కూడా చాలా బాగా కుదిరింది. ఎడిటింగ్ పరంగా మాత్రం ఫస్టాఫ్‌లో ఓ ఐదారు నిమిషాల ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, వాటిని ట్రిమ్ చేస్తే సినిమా ఇంకాస్త షార్ప్‌గా ఉంటుంది. సెకండాఫ్ మాత్రం చాలా క్రిస్పీగా ఉంది. సినిమాకు ఏం కావాలో అది సమకూర్చారు నిర్మాతలు. అది ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా ఉన్నాయి. కథగా ఒక మంచి మెసేజ్‌ని ఇచ్చేలా రాసుకున్న రాజేంద్ర.. స్ర్కీన్‌ప్లే, దర్శకత్వంలో కూడా ఎక్కడా తడబడలేదు. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని, ఇవ్వాలనుకున్న మెసేజ్‌ని హారర్‌తో లింక్ చేసి, కామెడీని జోడించి.. ప్రేక్షకులకు చేరేలా చేశాడు. ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కూడా, చివరిలో ఆయన ఇచ్చిన మెసేజ్‌కి సింక్ అయ్యేలా సినిమాను రూపొందించినందుకు అభినందించవచ్చు. మిగతా సాంకేతిక నిపుణులందరూ తమ ప్రతిభను కనబరిచారు.
విశ్లేషణ:
సినిమా ఓపెనింగ్ సీనే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మొదలవుతుంది. సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. డెలివరీ బాయ్ గొప్పతనాన్ని హీరో తన తండ్రితో చెప్పే ఎపిసోడ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎలాంటి ల్యాగ్ తీసుకోకుండా డైరెక్ట్‌గా శోభనం సీన్‌లోకి తీసుకెళ్లి, వెంటనే హారర్ ఎలిమెంట్స్‌తో నింపేశాడు దర్శకుడు. దెయ్యం పట్టిందని తెలుసుకున్న తర్వాత పూజారి దగ్గరకు వెళితే చెప్పే యజ్ఞాల లిస్ట్, మసీదులో బాబా కోరికలు అన్నీ కూడా నేచురల్‌గా ఉంటాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. బ్లాక్ స్పారో ఎంట్రీ నుంచి అంతా నవ్వుకుంటూనే ఉంటారు. పాత రోజుల్లో అలీ మాట్లాడే భాషని బ్లాక్ స్పారోతో చెప్పిస్తూ.. కామెడీని పండించిన తీరు అలరిస్తుంది. విల్లా నెంబర్ 19, విల్లా నెంబర్ 21 ఈ సినిమాలో కీలక అంశాలు. నైనా పాత్ర ఎంటరైనప్పటి నుంచి సినిమా గ్రాఫ్ బాగా లేస్తుంది. కాకపోతే ఆమె చీరకట్టుకోవడానికి రీజన్ ఏంటో చెప్పిన వెంటనే డ్రస్‌లో పబ్‌లో ప్రత్యక్షమైన తీరే కన్వెన్సింగ్‌గా అనిపించదు. ఒక అనుమానపు భర్తగా విక్కీ పాత్ర విలనిజాన్ని, సింపతీని రాబడుతుంది. అలాగే జానర్‌కి దగ్గట్టుగా ఇంకొన్ని హారర్ అంశాలు పడి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా అంతటా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగా పేలాయి. క్లైమాక్స్ కట్టిపడేస్తుంది. సినిమా పూర్తయిన తర్వాత ‘అడగందే అమ్మ అయినా పెట్టదు’ అంటూ ‘భార్యభర్తల ప్రేమ’పై హీరో ఇచ్చే మెసేజ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన ఇచ్చిన మెసేజ్‌కి ఈ సినిమా బాగా సింక్ అవుతుంది. శోభనం సీన్‌తోనే పార్ట్ 2కి ఇచ్చిన హింట్ ‘చంద్రముఖి’ని తలపిస్తుంది. మొత్తంగా అయితే.. హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారు నిశ్చింతగా ఈ సినిమాను చూడొచ్చు.
ట్యాగ్‌లైన్: మంచి మెసేజ్ ఇస్తారు.. వెళ్లండి!
రేటింగ్: 3/5






