Sunday, March 22, 2026

గంగూలీని 10 రోజులు బతిమాలితే ధోనీని ఒప్పుకున్నాడు: మాజీ సెలెక్టర్

టీమిండియాకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టును మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్‌గా నిలిపాడు. 28 ఏళ్ల ప్రపంచకప్ నీరీక్షణకు తెరదించాడు. వరల్డ్ కప్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రీఫీనీ అందించాడు. ఇక తొలి ప్రపంచ టీ20 ప్రపంచకప్‌ను కూడా భారత్‌ సాధించడంలో ధోనీ పాత్ర కీలకమనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ధోనీని దేశవాళీ జట్టులోకి తీసుకోవడానికి కూడా అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒప్పుకోలేదట. సెలెక్టర్లంతా కలిసి 10 రోజుల పాటు బతిమాలితే అంగీకరించాడట. ఈ విషయాన్ని ధోనీని దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన ఒకప్పటి సెలక్షన్ కమిటీ మెంబర్, మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే వెల్లడించాడు.

‘2003-04 దులీప్ ట్రోఫీ ఫైన‌ల్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ దీప్‌దాస్ గుప్తా బ‌దులు ధోనీని ఆడించేందుకు చాలా కష్టప‌డ్డాను. గంగూలీ, దీప్‌దాస్‌ గుప్తా ఇద్దరు బెంగాల్‌కు చెందిన వారే. దాంతో అతడిని తొలగించడానికి గంగూలీ అంగీకరించలేదు. ఆ విషయం తెలిసి కూడా గంగూలీని ఒప్పించేందుకు ప్రయత్నించాను. చివరకు గంగూలీ ఒప్పుకోవడం.. ధోనీ జట్టులోకి రావడం చకచకా జరిగిపోయాయ’ని కిరణ్ మోరే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అంతకుముందు ఓ స్నేహితుడు సలహాతో ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూడటానికి వెళ్లానని, ఆ మ్యాచ్‌లో జట్టు మొత్తం 170 పరుగులు చేస్తే, ధోని ఒక్కడే 130 పరుగులు సాధించాడని మోరే చెప్పాడు. ఆ మ్యాచ్‌లో బౌలర్లపై ధోనీ విరుచుకుపడిన తీరు తనకు బాగా నచ్చిందని, ఆ నమ్మకంతోనే అతడిని దులీప్ ట్రోఫీ ఫైన‌ల్లో ఈస్ట్ జోన్ త‌ర‌ఫున ఆడించాల‌ని అనుకున్నానని, గంగూలీని ఒప్పించడంతో ఫైనల్స్‌‌లో బరిలో దిగిన ధోనీ.. తొలి ఇన్నింగ్స్‌లో 21 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 60 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడని తెలిపాడు.

దీంతో ఆ వెంట‌నే ధోనీని ఇండియా-ఏ త‌ర‌ఫున కెన్యాలో జ‌రిగిన ట్రయాంగిల్ టోర్నీకి పంపించామని, ఆ టోర్నీయే అతని కెరీర్‌ను మ‌లుపు తిప్పింద‌ని మోరే చెప్పుకొచ్చాడు. అందులో ధోనీ ఏకంగా 600 ప‌రుగులు సాధించి, జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడని వెల్లడించాడు. ఆ స‌మ‌యంలో(2003 వన్డే ప్రపంచకప్‌ తర్వాత) టీమిండియాకు రెగ్యుల‌ర్ వికెట్ కీప‌ర్ లేకపోవడం ధోనీకి మరింత కలిసొచ్చిందని, అందివచ్చిన అవకాశాలకు అతను ఒడిసి పట్టుకుని భారత దేశం గర్వించే స్థాయికి ఎదిగాడంటూ ధోనీపై మోరే ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా.. తాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడానికి నాటి చీఫ్‌ సెలక్టర్‌ మోరే చాలా సహయపడ్డాడని ధోనీ కూడా ఎన్నో సందర్భాల్లో చెబుతుండడం తెలిసిందే.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -