లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. అధికారులే ఏకంగా లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఓ లోన్ యాప్ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి ఈడీ అధికారి లలిత్ లంచం తీసుకున్నట్లు వెల్లడైంది. దాదాపు రూ.5 లక్షలు ఆయన లంచంగా పుచ్చుకున్నారని, ఈ ట్రాన్సాక్షన్ బెంగళూరులో జరిగిందని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. సీసీఎస్ అధికారులు ఫ్రీజ్ చేసిన లోన్ యాప్స్ ఎండీ ఖాతాలను తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులోని ఓ బ్యాంకు ఖాతాకు సంబంధించి లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. ముంబైకి చెందిన అపోలో ఫైన్‌వెస్ట్ ఎండీ దగ్గర నుంచి ఈడీ లలిత్‌కు ఈ సొమ్ము ముట్టినట్లు నిర్ధారించారు. ఈడీ అధికారి బాగోతంపై సీబీఐకి హైదరాబాద్ పోలీసులు సమాచారం అందించారు. బెంగళూరులో ఉన్న పలు బ్యాంకులకు తప్పుడు పత్రాలు ఇచ్చి లలిత్ బజార్డ్ డబ్బులు రిలీజ్ చేయించినట్లు వారి విచారణలో తేలింది. దీంతో లలిత్ బజార్డ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.
కాగా.. లోన్ యాప్స్ విషయంలో హైదరాబాద్‌లో కొంత కాలం క్రితం వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో అనేకమంది ఈ లోన్ యాప్స్ ఈఎంఐలను కట్టలేక ఇబ్బందులు పడుతుంటే వారిపై సదరు అప్లికేషన్ల ఉద్యోగులు దారుణంగా దూషిస్తూ వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైం పోలీసులు దీనిపై దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న అనేక లోన్ యాప్స్‌ను బ్యాన్ చేశారు. అలాగే ఆయా సంస్థల యజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టులు కూడా చేశారు.