బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని, పార్టీలోకి ఈటల రాకను వ్యతిరేకిస్తే వారికే నష్టమని బీజేపీ నేతలపై ఆ పార్టీ రాష్ట్ర నేత రాజాసింగ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల వస్తే చాలా మంది టీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు బీజేపీలోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవర్ని చేర్చుకోవాలో జాతీయ నాయకత్వానికి తెలుసని, ఈటల వస్తే బయటకు వెళ్తామనే వారు ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీ ఎప్పటికీ తాత, తండ్రుల పార్టీ కాదనే విషయం అంతా గుర్తుంచుకోవాలని రాజాసింగ్ హెచ్చరించారు.
టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి తొలగించింది టీఆరెస్. దీంతో ఆయన ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఆయన రాష్ట్ర, జాతీయ నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నారు. ఇటీవల ఈటల ఢిల్లీలో బీజేపీ నేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కూడా అయ్యారు. అయితే ఈటల రాకను బీజేపీలో కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జల్లాలోని పలువురు బీజేపీ ఈటల రాకను వ్యతిరేకిస్తున్నారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని ఆయన హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు.
కాగా.. ప్రస్తుతం పరిణామాలను బట్టి చూస్తే ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పెద్దిరెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ నాయకురాలు డీకే అరుణ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.