ప్రతి ఆటగాడూ ఏదో ఒక సమయంలో తన కెరీర్‌కు గుడ్ బై చెప్పాల్సిందే. క్రికెట్ అయినా, ఫుట్‌బాల్ అయినా.. ఏ క్రీడ అయినా.. ఆటగాడు రిటైర్ కావాల్సిందే. తాజాగా ఓ ఆటగాడు కూడా తన క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. తాను క్రికెట్ నుంచి అలసిపోయానని, అందుకే రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. అతడే ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ గార్నీ. జీవితం మొత్తం గాయాలతో సతమతమైన గ్యార్నీ జాతీయ జట్టు తరపున అతి తక్కువ మ్యాచ్‌లే ఆడాడు.
గ్యార్నీ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పాడు. గార్నీ ఇంగ్లండ్ తరపున 10 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. 2 ఫార్మాట్లు కలిపి మొత్తం 14 వికెట్లు తీశాడు. 2014లో స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన గార్నీ.. కెరీర్ మొత్తం గాయాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు కూడా భుజం గాయంతో బాధపడుతూనే గ్యార్నీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
కాగా.. గార్నీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అద్భుతంగా ఆడాడు. నాటింఘమ్‌షైర్ తరపున 103 ఫస్ట్ క్లాస్, 93 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 156 టీ20 మ్యాచ్‌లాడి మొత్తంగా 614 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన గార్నీ 8 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీశాడు. 2017లో టీ20 బ్లాస్ట్ టోర్నీలో కూడా నాటింఘమ్‌షైర్ కప్ గెలవడంలో గార్నీ కీలక పాత్ర పోషించాడు.
రిటైర్మెంట్ గురించి ఆయన మాట్లాడుతూ.. ”నా రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. 24 ఏళ్ల నా ఫస్టక్లాస్ కెరీర్‌లో గాయాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చివరకు గుడ్‌బై చెప్పే సమయంలోనూ భుజం గాయంతో బాధపడుతున్నాను. ఇక ఆడే ఓపిక లేదు. బాగా అలిసిపోయాను. అందుకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. కానీ ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నాటింఘమ్‌షైర్‌ను మాత్రం వదల్లేదు. వీటితో పాటు ఇంగ్లండ్‌కు ఆడడం.. ఐపీఎల్, బిగ్‌బాష్, సీపీఎల్ లాంటి మేజర్ టోర్నీలో పాల్గొనడం నేను గర్వంగా ఫీల్ అవుతానం’టూ గ్యార్నీ చెప్పుకొచ్చాడు.