2019 ప్రపంచకప్‌కు రైనా, కార్తీక్‌లతో పాటు మంచి ఫాంలో ఉన్న అంబటి రాయుడును కాదని విజయ్ శంకర్‌కే ఓటు వేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విజయ్ శంకర్ కరెక్టుగా సరితూగాడని.. అతను మల్టీ డైమన్షన్ ప్లేయర్ అంటూ ప్రసాద్ మీడియాకు తెలిపాడు. సెలెక్షన్ కమిటీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ తర్వాత టోర్నీ చూసిన వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. విజయ్ఎంపికయితే అయ్యాడు కానీ.. టోర్నీలో మాత్రం విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఇతనేనా మీ త్రీ డైమన్షనల్ ప్లేయర్.. త్రీడీ కళ్లద్దాలు పెట్టుకున్నా అతని ఇన్నింగ్స్ ఒక్కటి కనిపించలేదు అంటూ అభిమానులు ట్రోల్ చేశారు. ఈ ఒక్క దెబ్బతో విజయ్ శంకర్ ఇప్పటివరకు మళ్లీ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు.
టీమిండియాలో మళ్లీ స్థానం సంపాదించడానికి సంబంధించిన విజయ్ శంకర్‌ను తాజాగా ఓ మీడియా సంస్థ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అతడు కొంత ఆసక్తిర సమాధానమే ఇచ్చాడు. ”ఇప్పట్లో కష్టమే కావొచ్చు.. కానీ అది నా చేతుల్లో లేదు. నేను ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. అయితే టీమిండియాకు అరంగేట్రం చేసే సమయంలో నన్ను గాయాలు ఇబ్బంది పెట్టాయి. ఒక సిరీస్‌లో మంచిగా ఆడుతున్న దశలో ఏదో ఓ గాయంతో జట్టుకు దూరమయ్యాను. టీమిండియాకు ఆడిన అన్ని సందర్భాల్లో మంచి ప్రదర్శనే నమోదు చేశా. విధి నాతో ఆడుకుంద’ని చెప్పుకొచ్చాడు.
కెరీర్ మొత్తంలో నాకు గాయాలే ఎక్కువగా ఎదురయ్యాయని, తాను మ్యాచ్‌లో బరిలోకి దిగిన ప్రతీసారి కష్టపడే ఆడాలనుకుంటానని, ఇప్పటికీ టీమిండియాలోకి తాను వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పాడు. అయితే తాను టీమిండియాలోకి ఎంపిక కావడం అనేది తన చేతుల్లో లేదని విజయ్ శంకర్ చెప్పాడు.
ఇక ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శంకర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. నానాటికీ అతని ఆటతీరు మరీ ఘోరంగా తయారవ్వడం కనిపించింది. ఇలాంటి చెత్త ప్రదర్శనతో అతను మళ్లీ టీమిండియాలోకి అడుగుపెట్టడం కష్టమే. ఇక టీమిండియా తరపున విజయ్ శంకర్ 12 వన్డేల్లో 223 పరుగులు.. 4 వికెట్లు, 9 టీ20ల్లో 101 పరుగులు.. 5 వికెట్లు తీశాడు.
ఇదిలా ఉంటే నిజానికి 2016లోనే విజయ్ శంకర్ టీమిండియాలోకి అరంగేట్రం చేయాల్సింది. కానీ హార్దిక్ పాండ్యా రూపంలో అతనికి దురదృష్టం ఎదురైంది. దంతో రెండేళ్ల తరువాత 2018లో నిదహాస్ ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ ట్రోపీలో ఒక మ్యాచ్‌లో 2 కీలక వికెట్లు తీయడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2019 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా హార్దిక్ పాండ్యా స్థానంలో అవకాశం లభించింది. అలా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. కానీ ఆ తర్వాత అతడిని దురదృష్టం పట్టి పీడించింది. మరి టీమిండియాలో విజయ్ మళ్లీ ఎప్పుడు స్థానం సంపాదించగలడో చూడాలి.