2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఎంత గొప్ప విజయం సాధించిందో.. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఓటమి అంచుల నుంచి ఎలా బయటపడి చారిత్రక విజయాన్ని ఎలా నమోదు చేసిందో మళ్లీ కొత్తగా చెప్పకక్కర్లేదు. దేశంలోని ప్రతి క్రికెట్ అభిమానికీ అది గుర్తుంటుంది. ఆ విజయంలో కీలక పాత్ర ఎవరిదంటే కచ్చితంగా అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదే అని చెప్పాలి. అయితే తాజాగా టీ20 ప్రపంచకప్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ టోర్నీలో కెప్టెన్సీ తనకే దక్కుతుందని అనుకన్నానని, కానీ మధ్యలో ధోనీ వచ్చి కెప్టెన్సీ దక్కించుకున్నాడని చెప్పాడు.
‘2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని, దీంతో టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు సీనియర్లందరూ ముందుకురాలేదు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి సీనియర్ల గైర్హాజరీలో తనకే కెప్టెన్సీ వస్తుందని అందరూ భావించారు. నేను కూడా 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా పగ్గాలు నాకే ఇస్తారని భావించాను. అయితే సెలక్టర్లు సడెన్‌గా ధోనీ పేరును తెరపైకి తేవడం, అతను టీమిండియా పగ్గాలు చేపట్టడం చకాచకా జరిగిపోయాయి. అలాగే అతడికి కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయమేనని భావించాను. ధోనీ కెప్టెన్ అయ్యాక అతనికి పూర్తిగా మద్దతిచ్చా’ అంటూ యూవీ చెప్పుకొచ్చాడు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ ఈ విషయాలను వెల్లడించాడు. అయితే కెప్టెన్ ఎవరైనా ఆటగాడిగా రాణించడమే ముఖ్యమని, అందుకే ఆ విషయాన్ని అప్పుడే వదిలేశానని పేర్కొన్నాడు.
కాగా, ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన యువీ 148 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆ క్రమంలో అతను 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లోనూ యువీ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే బంతితోనూ ప్రత్యర్థులను మాయ చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.