Sunday, March 22, 2026

‘మాన్సాస్‌’ తీర్పుపై పై కోర్టుకెళతాం.. గజపతిరాజు జైలుకే: విజయసాయి

సింహాచలం మాన్సాస్‌ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తిరిగి నియామకమైన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో ఆయన మళ్లీ చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. సింహాచలం కేసులో సింగిల్‌ జడ్జి తీర్పుపై తాము మళ్లీ కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అశోక్ గజపతిరాజు వందల ఎకరాల దోచుకున్నాడని, ఫోర్జరీ కేసులో కూడా విచారణ ఎదుర్కొంటున్నాడని విజయసాయి గుర్తుచేశారు.

‘‘అశోక్‌గజపతిరాజు మాన్సాస్‌ ట్రస్టుకు మాత్రమే ఛైర్మన్‌.. విజయనగరం మొత్తానికి రాజు కాదు. వందల ఎకరాలు దోచుకున్న వ్యక్తి అశోక్‌ గజపతిరాజు. ఆయన అక్రమాలపై విచారణ జరుపుతున్నాం. అశోక్‌ గజపతిరాజుపై ఫోర్జరీ కేసు కూడా ఉంది. ఏదో ఒక రోజు జైలుకెళ్లే అవకాశం ఉంద’ని విజయసాయి అన్నారు.

సుప్రీం తీర్పు ప్రకారం స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం లేదని, మాన్సాస్‌ ట్రస్టులో మాత్రం పురుషులే ఛైర్మన్లు కావాలని నిబంధన పెట్టారని, మహిళల పట్ల అశోక్‌గజపతిరాజు వివక్ష చూపించారని విజయసాయి మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా నియమాలు పెట్టుకున్నారని, ప్రభుత్వం దేవదాయశాఖ నియమాలకు అనుగుణంగానే నడుచుకుందని పేర్కొన్నారు.

కాగా.. సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీవోనూ హైకోర్టు కొట్టేసింది. మొత్తం నాలుగు జీవోలను (71, 72, 73, 74) రద్దు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, ట్రస్టు పూర్వ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం వంశ పారంపర్య ట్రస్టీ/ ఛైర్మన్‌గా పునరుద్ధరిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని స్పష్టం చేసింది. అశోక్ గజపతిరాజు నియామకానికి సంబంధించి గతంలో జారీ చేసిన జీవోలను సమర్ధించింది.

మాన్సాస్‌ ట్రస్టు.. ట్రస్టు డీడ్‌, ప్రాపర్టీ రిజిస్టర్‌ ప్రకారం ‘కుటుంబంలో పెద్దవారయిన పురుషులు’ వంశపారంపర్య ఛైర్మన్‌/అధ్యక్షులుగా వ్యవహరించాలని స్పష్టంగా ఉందని, అందువల్ల అశోక్‌ గజపతిరాజే ట్రస్టు ఛైర్మన్‌గా ఉండాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు సంచయిత నియామకాన్ని రద్దు చేస్తూ అశోక్‌గజపతిరాజు నియామకాన్ని పునరుద్ధరించింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -