కరోనా కారణంగా భారత్ నాశనమైపోయిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా కూడా ఈ మహమ్మారి వల్ల భారీగా నష్టపోయిందని, ఈ నష్టానికి ప్రతిఫలంగా చైనా వెంటనే అమెరికాకు 10 ట్రిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలను ప్రస్తావించారు. చైనా చేసిన పనికి అనేక దేశాలు అల్లకల్లోలం అయ్యయని, చైనా ఇది కావాలని చేసినా లేదా ప్రమాదవశాత్తు జరిగినా తీవ్ర నష్టమైతే వాటిల్లిందని ట్రంప్ అన్నారు. భారతదేశంలో కరోనా పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. వైద్య సదుపాయాలు కరవై భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. కొవిడ్‌తో భారత్ సర్వనాశనమైందని అన్నారు. ఒక్క భారత్ మాత్రమే కాదు అన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది.
‘కరోనా విజృంభణ కచ్చితంగా చైనా అసమర్థత కారణంగా జరిగినట్లు భావిస్తున్నా. ఎలా జరిగినా దీనివల్ల అనేక దేశాలు కోలుకోలేనంతగా నష్టపోయాయి. ఆ దేశాలు మళ్లీ మునుపటిలా ఉండకపోవచ్చు. అమెరికాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. కానీ మరికొన్ని దేశాలపై మరింత అధిక ప్రభావం చూపించింది. అంతేకాకుండా కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది..? అనే విషయాలు తేలాల్సిన అవసరం ఉంది. ఇందుకు చైనా సహకారం అందించాల’ని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం చైనాతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి వేగంగా పుంజుకుంటున్నట్లు తెలిపారు.