కరోనా సెకండ్ వేవ్ దాడి నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఇదే సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది కూడా అక్టోబర్ నాటికి థర్డ్ వేవ్ సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో సర్వత్రా ఆందోళన మొదలవుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్.. ఓ సర్వే నిర్వహించింది. జూన్ 3 నుంచి 17 మధ్య చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 40మందికి పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రొఫెసర్లు, డాక్టర్లు పాల్గొన్నారు.
వీరిలో అత్యధికంగా(24మంది నిపుణుల్లో 21మంది) అక్టోబర్ నాటికి మరోసారి కోవిడ్ విజృంభణ తప్పదని అభిప్రాయపడ్డారు. మరో ముగ్గురు మాత్రం నవంబర్-ఫిబ్రవరి మధ్య కాలంలో థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని అంచనా వేశారు. మొత్తానికి థర్డ్ వేవ్ రావడం మాత్రం పక్కా అని హెచ్చరిస్తున్నారు.
అయితే రెండో వేవ్ తో పోల్చితే థర్డ్ వేవ్ ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని కూడా వారు అంచనా వేస్తున్నారు.
భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సిన్ ప్రక్రియను చూస్తుంటే రానున్న రోజుల్లో సంభవించే మరో ముప్పును నియంత్రించవచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా మాట్లాడుతూ.. భవిష్యత్తులో వచ్చే కొత్తరకం వేరియంట్లపై కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు వాటిని సమర్థంగానే ఎదుర్కొంటాయని అంటున్నారు. కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్ నాటికి చాలామందికి వ్యాక్సిన్ అందడంతోపాటు రెండోవేవ్ వల్ల కలిగే రోగనిరోధక శక్తి దీనికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని అంతా ఆందోళన చెందుతున్నారని, అది కొంతవరకు నిజమేనని మెజారిటీ నిపుణులు అంటున్నారు. సర్వేలో పాల్గొన్న నిపుణుల్లో మూడోవంతు (26మంది) అవుననే సమాధానమిచ్చారు. మరో 14 మంది మాత్రం పిల్లలకు ప్రమాదమేమీ లేదన్నారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడమే ముప్పుకు కారణమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎపిడమాలజిస్టు డాక్టర్ ప్రదీప్ బనాందూర్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చిన్నారులకు సంబంధించి ఐసీయూ పడకలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ముప్పు ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని కొవిడ్‌పై కర్ణాటక ప్రభుత్వ సలహాదారు డాక్టర్ దేవీ శెట్టి హెచ్చరించారు.
కాగా.. థర్డ్‌వేవ్‌లో చిన్నారులకు వైరస్ సోకినప్పటికీ తీవ్రత మాత్రం తక్కువగానే ఉండే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ మధ్య వెల్లడించిన విషయం తెలిసిందే.