నెలలుగా ఈ రోజు కోసం క్రికెట్ అభిమానులంతా ఎదురుచూశారు. ఎప్పుడెప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మొదలవుతుందా అని ఆశగా వేచి చూశారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. కానీ అందరి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలిరోజు ఆట నిలిచిపోయింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో శుక్రవారం తొలిరోజు ఆట సగం రోజు వరకు సాగలేదు.
తొలుత తొలి సెషన్ వరకు వేచి చూడగా, భోజన విరామం అనంతరం సైతం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ క్రమంలోనే వరుణుడు కాస్త కనికరించినా.. మైదానమంతా వర్షం నీరు ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. రేపటి నుంచి మ్యాచ్ సజావుగా సాగితే తొలిరోజు కోల్పోయిన సమయాన్ని రిజర్వ్‌డే రోజు నిర్వహించే అవకాశం ఉంది.
Due to persistent rain, play has been abandoned on day one of the #WTC21 Final in Southampton ⛈️#INDvNZ pic.twitter.com/Vzi8hdUBz8
— ICC (@ICC) June 18, 2021
ఇదిలా ఉంటే ఐసీసీ ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు. 2 బలమైన జట్ల మధ్య హోరాహోరీగా సాగే మ్యాచ్‌ను చూద్దామని భావించామని, జూన్‌లో బ్రిటిష్ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి కూడా ఐసీసీ అక్కడే మ్యాచ్ నిర్వహించడం సరికాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. 2019 వన్డే ప్రపంచకప్ కూడా ఇలానే ఇంగ్లాండ్ లోనే ఐసీసీ నిర్వహించింది. అయితే ఆ టోర్నీలో ఎక్కువ మ్యాచులు వర్షార్పణమయ్యాయి. సెమి ఫైనల్లో న్యూజిల్యాండ్ చేతిలో తేమ ఇండియా ఓటమికి కూడా ఓ రకంగా వరుణుడి కారణం. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.