భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ వరుణుడి కారణంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తొలి రోజు ఆటతో పాటు రెండోరోజు ఆట మొదటి సెషన్ వరుణుడి ఖాతాలో చేరింది. ఎలాగోలా మూడో రోజు ఆట సాగినా.. మళ్లీ నాలుగో రోజు ఆట ను వర్షం ముంచేసింది. దీంతో మ్యాచ్ పై అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే మ్యాచ్ ఫలితం కోసం 6 వ రోజును కూడా రిజర్వ్ డేగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. కాగా.. ఇప్పుడు మ్యాచ్ పరిస్థితులు చూస్తే కచ్చితంగా 6వ రోజు ఆట జరిగనుంది. దీంతో రిజర్వు డే టికెట్లను తక్కువ ధరకు విక్రయించాలని ఐసీసీ నిర్ణయించింది.
వర్షం కారణంగా తొలి రోజు మ్యాచ్ జరగకపోవడంతో రిజర్వు డే అయిన 23న కూడా మ్యాచ్‌ను నిర్వహించాలని ఐసీసీ అప్పుడే నిర్ణయించింది. రిజర్వ్ డే టికెట్లను తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించినట్టు ఐసీసీ వర్గాలు తెలిపాయి. యూకే జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు ఇలా తక్కువ ధరకు టికెట్లను విక్రయించడం సాధారణ విషయమేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. టెస్టు మ్యాచ్ కేవలం యూకే వాసులకే అందుబాటులో ఉన్నప్పటికీ ఐసీసీ మాత్రం ఇవే నిబంధనలు పాటిస్తుందని తెలిపాయి.
టిక్కెట్ రేట్లు:
డబ్ల్యూటీసీ ఫైనల్ టికెట్ ధరలు మూడు స్లాబుల్లో అందుబాటులో ఉన్నాయి. జీబీపీ 150 (రూ. 15,444), జీబీపీ 100 (రూ. 10,296), జీబీపీ 75 (రూ. 7,722) కాగా, ఆరో రోజు కోసం టికెట్ రేట్లను స్వల్పంగా తగ్గించారు. ఇవి వరుసగా జీబీపీ 100 (రూ. 10,296), జీబీపీ 75 (రూ. 7,722), జీబీపీ 50 (రూ. 5,148)గా ఉన్నాయి.
4 రోజుల ఆట సాగిందిలా..
తొలి రోజు వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దు కాగా, రెండో 64.4 ఓవర్లు మాత్రమే జరిగాయి. మూడో రోజైన ఆదివారం ఇరు జట్లు కలిసి 76.3 ఓవర్లు మాత్రమే ఆడాయి. నాలుగో రోజు కూడా దాదాపు తుడిచిపెట్టేసుకుపోవడంతో ఆరో రోజైన రిజర్వు డే నాడు మ్యాచ్‌ను కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది.