పొట్టి సందేశాల సోషల్ మీడియా ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ట్విటర్‌లో వస్తున్న కొన్ని సందేశాలపై కేంద్ర ఇచ్చిన వార్నింగ్‌ను ట్విటర్ తప్పుబట్టింది. అలాగే భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం ఉందంటూ కామెంట్ చేసింది. ఈ క్రమంలోనే ట్విటర్ వ్యాఖ్యలను కేంద్ర ఐటీ శాఖ ఖండించింది. ట్విట్టర్ బెదిరింపు ఆలోచనతో ఎలాంటి ఆధారాలూ లేని ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విటర్ పాఠాలు నేర్పుతోందని ఎద్దేవా చేసింది.
అంతేకాకుండా ట్విటర్ ఉద్దేశ పూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని, అలాంటి ట్విటర్ తమకే నిబంధనల గురించి పాఠాలు నేర్పేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని ట్విటర్ చూస్తోందని, అది ట్విటర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని పేర్కొంది.
‘కాంగ్రెస్ టూల్ కిట్’ వ్యవహారంలో ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని, పోలీసుల చేత బెదిరించే ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించింది. భావ ప్రకటనా స్వేఛ్చకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం ప్రకారం తాము నడుచుకుంటామని అంటూనే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో దూషణలకు దిగింది.
కాగా.. ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘మానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ ఉంచింది. ఈ ట్యాగ్ విషయంలోనే ట్విటర్-కేంద్రం వార్ మొదలైంది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరినా.. ట్విటర్ ఒప్పుకోలేదు. దీంతో ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు మే 24న సాయంత్రం వెళ్ళారు. ఈ క్రమంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ వివాదం చిలికి చిలికి పెను తుఫానులా మారింది.