పీఎం కేర్స్ నిధులతో ఇటీవల కేంద్రప్రభుత్వం 150 వెంటిలేటర్లను కొనుగోలు చేసింది. వాటిని జీఎమ్‌సీహెచ్ ఆస్పత్రికి కేటాయించింది. రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతి సీఎన్‌సీ అనే సంస్థ ఈ వెంటిలేటర్లను తయారు చేసింది. అయితే వాటిని వాడడం మొదలు పెట్టినప్పటి నుంచే సాంకేతిక సమస్యలు తలెత్తడం మొదలు పెట్టింది. అలా వెంటిలేటర్లు తరచూ పాడవుతుండడంతో పేషెంట్ల ప్రాణాలకే ప్రమాదమనే దృష్టిలో వాటిని వినియోగించకూడదని ఆస్పత్రి యాజమాన్యం నిషేధించింది. ఈ విషయం ఇప్పుడు భారీ చర్చకు తెరతీసింది. కేంద్రం కొనుగోలు చేసిన వెంటిలేటర్లు పనిచేయకపోవడం ఏంటంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై కేసు నమోదు కావడంతో ముంబై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పీఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెంటిలేటర్ల కారణంగా ఎవరైనా కరోనా బాధితులు మరణిస్తే ఆ బాధ్యత కేంద్రానిదే అని తీవ్రంగా హెచ్చరించింది. జస్టిస్ రవీందర్ ఘుజె, జస్టిస్ బీయూ దెబాద్వార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుపై స్పందిస్తూ.. ఈ వెంటిలేటర్లను ఇప్పటికే పలు మార్లు రిపేర్ చేయాల్సి వచ్చిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితుడి ప్రాణాలకు ఎంతో అవసరమైన వెంటిలేటర్ల విషయంలో ప్రయోగాలు చేయడం దారుణమని, దీనిని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సహించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనివల్ల బాధితులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా.. కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన అదనపు సొలిసిటర్ జనరల్.. వైద్యుల బృందం ఒకటి ఈ వెంటిలేటర్ల పనితీరును పరీక్షించేందుకు ముంబైకి వెళుతుందని తెలిపారు. దీంతో కేసు విచారణను జూన్ 7కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. త్వరలో వైద్యుల బృందం ముంబైలోని ఆసుపత్రికి చేరి వెంటిలేటర్లను పరిశీలిస్తుంది.