పోరాటం చేసే ఉద్దేశమే ఉంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ గూటికే వచ్చి ఉండే వారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. వెంటనే సంప్రదించి ఉండే వారని పేర్కొన్నారు. ‘రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టడంతో ఈటలకు ఢిల్లీ పోలీసుల అవసరం ఏర్పడింది. కేంద్ర హోం శాఖ మోదీ, అమిత్‌షా చేతిలో ఉన్నందునే ఆయన బీజేపీతో కలుస్తున్నారు. ఆయనకు కేంద్ర హోంశాఖ, ఆదాయ పన్ను శాఖ, ఈడీల అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
కాగా.. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద రెండేసి చొప్పున మొత్తం నాలుగు ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. మరో రెండు, 3 రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. పేదలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్లు ఈ అంబులెన్సులను వాడుకోవచ్చని తెలిపారు. తన తల్లిదండ్రుల పేరుతో ట్రస్టును
ఏర్పాటు చేయాలనే కోరిక ఉందని, కరోనా సమయంలో అంబులెన్సులు ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్న భావనతోనే ఇలా సేవలు ప్రారంభించానని జగ్గారెడ్డి వెల్లడించారు.
ఇదిలా ఉంటే తెలంగాణ పీసీసీ పదవిపై మరోసారి జగ్గరెడ్డి నోరువిప్పారు. రేసులో తాను ఇప్పటికీ ఉన్నానని అన్నారు. ‘నాకో అవకాశం ఇవ్వమని సోనియా, రాహుల్‌గాంధీలను కోరుతునే ఉన్నా.
కానీ ఢిల్లీకి వెళ్లి పీసీసీ చీఫ్ కోసం అడిగే పరిస్థితి ప్రస్తుతం లేదు. అయితే ప్రజా సమస్యలకు ఎలాంటి మెడిసిన్ వేయాలో నాకు తెలుసు., అందుకే పీసీసీ చీఫ్ పోస్టును అడుగుతున్నాను. అయితే తనను కాకుండా వేరే ఎవరినైనా పీసీసీ చీఫ్‌గా నియమించినా.. కట్టుబడి ఉంటా. కానీ, మంచి వ్యక్తి పీసీసీ చీఫ్ అయితే రాష్ట్రమంతా తిరుగుతాను. లేకుంటే నా నియోజకవర్గానికే పరిమితమవుతాను’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్నారని, పీసీసీపై ఇప్పుడు చర్చ ఎందుకొచ్చిందో తెలియదని, అయితే అధిష్ఠానం కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని భావిస్తే తాను ఆపబోనని, సీనియర్ల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే నియామకం చేపడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.