ఇప్పటివరకు వ్యక్తికి కరోనా సోకిందా..? లేదా..? అనే విషయాలను మాత్రమే వైద్యులు కనిపెట్టగలుగుతున్నారు. అయితే తాజాగా ఓ కొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీని ద్వారా వ్యక్తికి కోవిడ్ సోకిందనే విషయాన్ని తెలుసుకోవడమే కాక వైరస్ ప్రభావం శరీరంపై ఎంత ఉంది..? సదరు బాధితుడు ఆసుపత్రిలో చేరాలా..? అవసరం లేదా..? అనే విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది
కరోనా వచ్చినవారిలో చాలా మందిలో అసలు లక్షణాలే కనపడట్లేదు. లక్షణాలు కనిపించినవారిలో కూడా అత్యధికులకు ఇంటివద్దే ఉంటూ మందులు వాడితే తగ్గిపోతోంది. మొత్తమ్మీద ఇలా దాదాపు 95% మంది ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రావట్లేదు. మిగతావారికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స, వారిలో కొందరికి ఆక్సిజన్ సపోర్టు, అతి తక్కువ మందికి ఐసీయూలో వెంటిలేటర్ చికిత్స కావాల్సివస్తున్నాయి. కేవలం ఒక శాతం మంది మాత్రమే చనిపోతున్నారు.
ఎవరికి ఇంటి దగ్గర చికిత్స సరిపోతుంది? ఎవరి పరిస్థితి ఆస్పత్రి, ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ దాకా వెళ్తుంది? ముందే తెలిస్తే దానికి తగ్గట్టుగా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది. అందుకే ఈ దిశగా దక్షిణ ఫ్లోరిడా హెల్త్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు దృష్టిసారించారు. కరోనా వచ్చినవారిలో ఊపిరితిత్తుల సమస్య (పల్మనరీ ఫైబ్రోసిస్.. అంటే మృదువుగా సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ ఉండాల్సిన ఊపిరితిత్తి సాగే గుణాన్ని కోల్పోయి గట్టిపడిపోవడం) బారిన పడినవారి జన్యువులను అధ్యయనం చేశారు.
వారందరిలో ఆ సమస్యకు కారణమైన 50 జన్యువులను గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా.. ఒక రక్తపరీక్షను రూపొందించారు. ఈ పరీక్ష ఫలితం కూడా దాదాపు 75 శాతం ఉన్నట్టు సమాచారం.
పరీక్ష ఎలా..?
కరోనా వచ్చినవారి రక్తనమూనాలను సేకరించి ఈ పరీక్ష చేయడం ద్వారా.. వారిలో ఎవరికి ఆస్పత్రి, ఆక్సిజన్, వెంటిలేటర్ చికిత్స అవసరమవుతుందో ముందే తెలుసుకోవడమే వారి లక్ష్యం. అలా ముందే గుర్తించగలిగితే వారికి తగిన చికిత్స సకాలంలో అందించవచ్చని.. యాంటీ ఫైబ్రోటిక్ మందులను వాడొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.